దేవుడా ఎందుకిలా చేశావయ్యా.. జాబ్‌ వచ్చిందనే ఆనందం క్షణాల్లో ఆవిరైంది..

Brother And Sister Died At Khammam  Road Accident - Sakshi

చిన్నతనంలోనే వారిద్దరూ తల్లిదండ్రుల్ని కోల్పోయారు. పేరెంట్స్‌ను కోల్పోయిన అన్నాచెల్లెలిని.. పెదనాన్న, నానమ్మలే పెంచి పెద్దచేశారు. స్వయంకృషితో చదవి అన్న ఉద్యోగం చేస్తుండగా.. చెల్లి మరో రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం వారిని మృత్యువు రూపంలో వెంటాడింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందులో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం ఎన్‌.కె.నగర్‌ పంచాయతీకి చెందిన మరికంటి నీరజ్‌(27), నిహారిక(22)లు అన్నాచెల్లెలు. తల్లిదండ్రులు విజయ్‌కుమార్‌, లలితలు వీరి చిన్నతనంలోనే మృతిచెందారు. ఈ క్రమంలో పెద్దదిక్కును కోల్పోవడంతో పెద్దనాన్న అశోక్‌, నాయనమ్మల వద్దే వారిద్దరూ పెరిగారు. కాగా, ఇంటర్‌ పూర్తి చేసిన నీరజ్‌..  స్థానికంగా ఓ కార్ల షోరూంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. నిహారిక డిగ్రీ చదివి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఇటీవల ఉద్యోగం సంపాదించింది. రెండు రోజుల్లో కొలువులో చేరేందుకు వెళ్లాల్సి ఉంది. 

దీంతో, వారు జీవితంలో సెటిల్‌ అయ్యారని ఎంతో సంతోషించారు. ఈ సందర్భంగా నిహారిక..  సోదరుడు నీరజ్‌, స్నేహితురాలు మేరీతో పార్టీ కోసం బైక్‌పై పాల్వంచ బయలుదేరారు. ఒక ధాబాలో డిన్నర్‌ చేసి రాత్రి తిరుగు పయనమయ్యారు. రేగళ్ల క్రాస్‌రోడ్డు సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ముగ్గురూ కిందపడ్డారు. తలలకు తీవ్ర గాయాలై నీరజ్‌, నిహారికలు అక్కడికక్కడే మృతిచెందారు. మేరీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో​, ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top