Telangana: వేడుక ఏదైనా.. బౌన్సర్‌ పక్కా! | Bouncer Culture Rises In Nalgonda | Sakshi
Sakshi News home page

Telangana: వేడుక ఏదైనా.. బౌన్సర్‌ పక్కా!

Apr 13 2026 12:44 PM | Updated on Apr 13 2026 12:57 PM

Bouncer Culture Rises In Nalgonda

ఫంక్షన్లు, షాపుల ఓపెనింగ్‌లలో రద్దీ నియంత్రణకు బౌన్సర్ల సేవలు

సెలబ్రెటీలు వచ్చినప్పుడు సెక్యురిటీగానూ.. రాజకీయ సభలకు కూడా బౌన్సర్లు

చిన్న పట్టణాలకూ విస్తరించిన ట్రెండ్‌

బౌన్సర్లు.. సినీ తారలు, బడా పారిశ్రామికవేత్తల పక్కన మాత్రమే కనిపించేవారు. నగరాల్లో పబ్బులు, క్లబ్బుల్లోనే వీరి హడావుడి ఉండేది. కానీ ప్రస్తుతం ఎవరైనసెలబ్రిటీ బయట అడుగు పెట్టినా,వేడుకై నా, ప్రారంభోత్సమైనా వీరిని నియమించుకోవడం సర్వసాధారణమైంది. అయితే, నగరాల్లోనే ఎక్కువగా కనిపించే ఈ కల్చర్‌ కొన్నాళ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకూ విస్తరించింది.

నల్లగొండ టూటౌన్‌ : ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు, శుభకార్యాలను అట్టహాసంగా జరుపుకుంటున్నారు. శుభకార్యం చిన్నదైనా, పెద్దదైనా బంధుమిత్రుల ముందు తమ స్థాయిని ప్రదర్శించుకోవడానికి కొందరు ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించుకుంటున్నారు. వేడుకలో కొత్తదనం చూపించేలా, తోపులాట జరిగినా అదుపు చేసేలా పదుల సంఖ్యలో బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఈ ట్రెండ్‌ నడుస్తోంది. 

ఏ వేడుకలో చూసినా నల్లకోటు, దృఢమైన శరీరంతో కనిపించే బౌన్సర్లు సందడి చేస్తున్నారు. సంపన్న కుటుంబాల వారి వేడుకల్లో ఫంక్షన్‌ హాల్‌ గేటు నుంచి వేదిక వరకు వీరి హడావుడి కనిపిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు పోలీసుల బందోబస్తుతో పాటు బౌన్సర్ల సేవలను వాడుకుంటున్నారు. రాజకీయ పార్టీలు పెట్టే బహిరంగ సభలకూ బౌన్సర్లను వినియోగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహిరంగ సభలకు సైతం బౌన్సర్లను వినియోగించారు. వివిధ పట్టణాల్లో షాపింగ్‌ మాల్స్‌, ఆస్పత్రులు ప్రారంభించేందుకు సినీనటులు, మంత్రులు వచ్చే సందర్భంలోనూ బౌన్సర్లను పెడుతున్నారు.

బౌన్సర్‌కు రూ.1500 
బౌన్సర్ల వినియోగం పెరగడంతో సంబంధిత ఏజెన్సీలకు మంచి ఆదరణ లభిస్తోంది. యువతకు కూడా ఇదొక ఉపాధిగా మారింది. పదవ తరగతి వరకు చదివిన వారు కూడా ఈ రంగంలో ఉపాధి పొందవచ్చు. బౌన్సర్లు ప్రతిరోజూ జిమ్‌లలో వ్యాయామాలు చేస్తూ, డైట్‌ పాటిస్తూ తమ శరీర ఆకృతిని కాపాడుకుంటున్నారు. ఫంక్షన్ల నిర్వాహకులు ఒక్కో బౌన్సర్‌కు రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. అందులో కొంత సెక్యూరిటీ సంస్థ కమీషన్‌గా తీసుకుంటుంది. అయితే నల్లగొండ జిల్లాలో పురుషులు మాత్రమే బౌన్సర్లుగా సేవలందిస్తున్నారు. మహిళా బౌన్సర్లు లేరు. ఏదైనా వేడుకకు మహిళా బౌన్సర్లు కావాలని కోరితే హైదరాబాద్‌ నుంచి పిలిపిస్తామని సెక్యూరిటీ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

ఆడంబరం కాకుండా.. అవసరం కోసం 
కేవలం ఆడంబరమే కాకుండా, అవసరం కోసం వీరిని నియమించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వేడుకల్లో స్టేజీ మీదకు వెళ్లే సమయంలో తోపులాట జరగకుండా, అతిథులు క్రమ పద్ధతిలో వెళ్లేందుకు బౌన్స ర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకుల సొంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ శుభకార్యం చేసుకునేవారు సొంతంగా బౌన్సర్లను పెట్టుకుంటున్నారు.

బౌన్సర్లకు డిమాండ్‌ ఉంది 
శుభకార్యాలు జరుపుకునేవారు బౌన్సర్ల కోసం మా సంస్థను ఆశ్రయిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించుకోవడానికి బౌన్సర్లను ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారు. ఆలయాల వద్ద కూడా మా బౌన్సర్ల సేవలు అందిస్తున్నాం. రాజకీయ పార్టీల సభలకు కూడా పంపిస్తున్నాం. దీంతో బౌన్సర్లకు డిమాండ్‌ పెరిగింది.
– జానీపాషా, సురక్ష సెక్యూరిటీ అండ్‌ బౌన్సర్‌ సర్వీసెస్‌, నల్లగొండ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement