వినూత్న ప్రయత్నం: స్టాంపులపై సాహితీ ముద్ర

BHEL Chief Vigilance Officer Collected Poets postage stamps Over Literature - Sakshi

బీడీఎల్‌ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ వినూత్న ప్రయత్నం 

100 దేశాలు.. 1,000 మంది కవులు.. 1,100 తపాలాబిళ్లలు 

సాక్షి, హైదరాబాద్‌: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలోని ఆధునిక మార్పులు, తాత్విక అంశాలు కలగలిపి అద్భుత రచనలతో సాహిత్యంలో తొలి నోబెల్‌ బహుమతి అందుకున్న ఫ్రెంచ్‌ రచయిత సల్లీ ప్రుధోమ్మే... కాల్పనిక పాత్రలు సృష్టించి, అవి చేసే పనులతో మనల్ని కాల్పనిక లోకంలో విహరింపజేసిన బ్రిటిష్‌ రచయిత చార్లెస్‌ డికెన్స్‌...  కవిత్వం అంటే ఇలా ఉండాలి అని ప్రపంచం నలుమూలలా అనిపించుకున్న రాబర్ట్‌ ఫ్రాస్ట్‌...  103 పద్యాల సంకలనంతో భక్తి భావాన్ని కళ్లముందు నిలిపి మన దేశానికి ఏకైక సాహిత్య నోబెల్‌ సాధించిపెట్టిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌... 

ఇలా ఒకరేమిటి.. ఏకంగా వెయ్యి మంది కవులు, రచయితలు, ఇతర సాహితీవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా విశేషంగా సాహితీ సేవ చేసినవారు. ఆయా ప్రభుత్వాలు వారి పేరుతో తపాలాబిళ్లలు (స్టాంపులు) విడుదల చేసి నివాళులు అర్పించాయి. కొందరు మాతృదేశానికే పరిమితం కాకుండా.. ఇతర దేశాల్లోనూ తపాలాబిళ్లలపై సగౌరవంగా నిలిచారు. అలా తమదైన ‘ముద్ర’వేసుకున్న వెయ్యి మంది సాహితీవేత్తల పోస్టల్‌ స్టాంపులు ఒకచోట చేరాయి.

భారత్‌ డైనమిక్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) చీఫ్‌ విజిలెన్సు అధికారి వెన్నం ఉపేందర్‌ ఈ వినూత్న సేకరణ చేశారు. స్వతహాగా కవి అయిన ఉపేందర్‌కు ప్రపంచ సాహితీమూర్తులంటే ఎంతో అభిమానం. ఆయన మాతృసంస్థ తపాలా శాఖ కావడంతో పోస్టల్‌ స్టాంపులంటే ప్రత్యేక ఇష్టం. ఈ రెండు అభిరుచులను ఒకటి చేసి.. సాహితీరంగంలో విశేష సేవలందించిన వారి పేరిట విడుదలైన స్టాంపులను సేకరించారు. కొన్ని నెలల పాటు ప్రయత్నించి.. వంద దేశాలకు చెందిన వెయ్యి మంది సాహితీవేత్తల చిత్రాలున్న 1,100 స్టాంపులు, ప్రత్యేక పోస్టల్‌ కవర్లను సేకరించారు.

నోబెల్‌ సాహిత్య బహుమతి ప్రారంభమైన 1901 నుంచి 2017 వరకు ఆ అవార్డు పొందిన 186 మంది చిత్రాలున్న స్టాంపులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బ్రెజిల్‌లో జరుగుతున్న అంతర్జాతీయ తపాలాబిళ్లల ప్రదర్శనలో వీటిని అందుబాటులో ఉంచారు. ఇంతమంది సాహితీవేత్తల పేరిట విడుదలైన స్టాంపులు ఒకేచోట ఉండటం పట్ల సందర్శకులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. 

ఇంతకు ముందు కూడా.. 
గతంలో రామాయణం ఇతివృత్తంగా వివిధ దేశాలు విడుదల చేసిన పోస్టల్‌ స్టాంపులను ఉపేందర్‌ సేకరించారు. వాటిపై ఉన్న చిత్రాలతో రామాయణ గాథను వివరించగలిగేంతగా ఆ సేకరణ ఉండటం విశేషం. అప్పట్లో అది లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పుడు సాహితీవేత్తల స్టాంపుల సేకరణను కూడా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించిందని, 2022 బుక్‌లో పొందుపరచనుందని ఉపేందర్‌ చెప్పారు. త్వరలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులు కూడా తన సేకరణను పరిశీలించనున్నారని తెలిపారు. 

ప్రపంచంలో మరెవరూ ఇలా సేకరించలేదు 
వెయ్యి మంది సాహితీవేత్తలతో కూడిన తపాలా బిళ్లలను ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ సేకరించిన దాఖలాలు లేవు. నా ప్రయత్నమే మొదటిది. నా అభిమానాన్ని, అభిరుచితో రంగరించి ఇలా చాటుకున్నందుకు సంతోషంగా ఉంది.  – వెన్నం ఉపేందర్, బీడీఎల్‌     చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి  
చదవండి: రేపు పీవీ శతజయంతి ఉత్సవాలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top