ఆత్మలకు ఆసరా.. ఏళ్లుగా చనిపోయిన వారికి పెన్షన్లు..

Asara Pension Misuse In Karimnagar - Sakshi

సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్‌): రాజన్నసిరిసిల్ల జిల్లాలో చనిపోయిన వారికి పింఛన్లు వస్తున్నాయి. బతికుండి.. అన్ని అర్హతలున్న వారు ఏళ్లుగా ఆఫీస్‌లు చుట్టూ తిరిగిన అధికారులు కనికరించడం లేదు.  సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపు లేని తనం.. బాధ్యతా రాహిత్యం మూలంగా వందలాది మంది మృతులు ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. నెలవారీగా తనిఖీలు చేసి చనిపోయిన వారి పేర్లు తొలగించాల్సి ఉంది. కానీ మున్సిపల్‌ అధికారుల పట్టింపులేని తనంతో సచ్చినోళ్ల బ్యాంకు ఖాతాల్లో ప్రజాధనం పడుతూనే ఉంది.

అదే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు నివేదిక ఆధారంగా మృతుల పేర్లను ఎంపీడీవోలు తొలగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మృతులకు ఆసరా పెన్షన్లు వస్తున్నా.. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లోనే ఎక్కువగా ఆత్మల పేరిట ఆసరా పొందుతున్నారు. ఇప్పటికైన జిల్లా అధికారులు సచ్చినోళ్ల పెన్షన్‌లు తొలగించి అర్హులకు ఆసరా కల్పిస్తే.. ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు ప్రజాధనానికి సార్థకత ఉంటుంది. సిరిసిల్లలోని కార్మికక్షేత్రం బీవై నగర్‌లోని ఇంటి నంబరు 11–01–40లో నివసించే కోనమ్మగారి భూలక్ష్మి(78) ఐదేళ్ల కిందటే కాలం చేసింది. కానీ ఆమెకు ఇంకా వృద్ధాప్య పెన్షన్‌ రూ.2,016 వస్తూనే ఉంది.

ఆమె బ్యాంకు ఖాతాలో ఆసరా డబ్బులు పడుతున్నాయి. ఆమె పెన్షన్‌ నంబరు 12402 కేఏ0339114000 ద్వారా ఐదేళ్లుగా ప్రజాధనం బినామీల పాలవుతుంది.  ఇలా సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు జిల్లావ్యాప్తంగా వెయ్యి మందికి పైగా సచ్చినోళ్ల పేరిట ప్రతీ నెల ఆసరా పెన్షన్‌ సొమ్ము జమవుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా చనిపోయిన వారికి ఆసరా పెన్షన్‌ డబ్బులు ఇవ్వడంతో నెలకు రూ.20.16 లక్షల మేరకు ప్రజాధనం వృథా అవుతోంది. 

అర్హుడి వేదన.. అరణ్య రోదన
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన ఎక్కలదేవి రవి(30) మానసిక వికలాంగుడు. అతని తల్లిదండ్రులు దేవవ్వ, పుట్టయ్య దినసరి కూలీలు. రవికి పెన్షన్‌ ఇప్పించాలని కోనరావుపేట మండల అధికారుల చుట్టూ తిరిగారు. సిరిసిల్ల ఆస్పత్రికి సదెరం సర్టిఫికెట్‌ కోసం వచ్చారు. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో మానసిక వికలాంగులకు పరీక్షలు చేసే వైద్యుడు లేక సదెరం సర్టిఫికెట్‌ రాలేదు. ఫలితంగా ఆ అభాగ్యుడికి సర్కారు సాయం అందడం లేదు. ఇలాంటి అన్నీ అర్హతలు ఉన్న వారికి ఆసరా కల్పించే మానవత్వం అధికారుల్లో లోపించింది. ఇలాంటి వారు జిల్లాలో ఎందరో ఉన్నారు.

వీరంతా ‘ఆసరా’ అమరులు

సిరిసిల్ల పట్టణంలోని ఇంటి నంబరు 10–8–83లో మూడేళ్ల క్రితం చనిపోయిన కట్ల మల్లవ్వకు వృద్ధాప్య పెన్షన్‌ వస్తుంది.
    బీవై నగర్‌లో ఇంటి నంబరు 11–1–48లో నాలుగు నెలల క్రితం మరణించిన కుడిక్యాల రాజేశం అనే నేత కార్మికుడి ఇంకా పెన్షన్‌ అందుతుంది. 

 బీవై నగర్‌లోని ఇంటి నంబరు 11–2–52లోని దూస సుశీల ఏడాది కిందట మరణించినా వృద్ధాప్య పెన్షన్‌ వస్తుంది.
► నాలుగేళ్ల క్రితం మరణించిన సుంక పోచవ్వ అనే వితంతువుకు, మూడు నెలల క్రితం మరణించిన పోగుల రాధవ్వ వితంతువు పెన్షన్‌ వస్తుండగా.. మూడు నెలల కిందట మరణించిన వెంగళ ► బాలనారాయణకు నేత కార్మికుడి పెన్షన్, నాలుగు నెలల కిందట మరణించిన అల్లె రామస్వామికి నేత కార్మికుడి పెన్షన్‌  వస్తుంది.
 సిరిసిల్ల బీ.వై.నగర్‌లో వివిధ కారణాలతో 15 నెలల క్రితం మరణించిన వృద్ధురాలు గూడూరి శాంతవ్వ, నాలుగేళ్ల క్రితం     మరణించిన బూర లింగయ్య, మూడేళ్ల కిందట మరణించిన గాజుల చంద్రవ్వ, మూడేళ్ల కిందటే మరణించిన బొద్దుల పుణ్యవతి, రెండు నెలల కిందట మరణించిన కొండ రాజేశం ఆసరా పెన్షన్లు పొందుతున్నారు.

తప్పకుండా చర్యలు తీసుకుంటాం
చనిపోయిన వారికి ఆసరా పెన్షన్‌ ఇవ్వడం తప్పు. మున్సిపాలిటీల్లో కమిషనర్లు క్షేత్రస్థాయి నివేదికలతో చనిపోయిన వారి పెన్ష న్‌ తొలగించాల్సి ఉంటుంది. తప్పకుండా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. చనిపోయిన వారి డబ్బులు ఎవరు తీసుకున్నా రికవరీ చేయిస్తాం. దీనిపై మున్సిపల్‌ కమిషనర్లకు లేఖలు రాస్తాం.  

 – కౌటిల్యరెడ్డి, డీఆర్‌డీవో 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top