Artificial Intelligence: సర్వాంతర్యామి ఏఐఓటీ!

Artificial Intelligence Of Things Using In Electronic Gadgets - Sakshi

ఇందుకలదు... అందులేదు.. అన్నట్లు ఇప్పుడు ఏ వస్తువును చూసినా ఇంటర్నెట్‌తో పనిచేసేలా రూపొందుతున్నాయి. మా కారులో ఇంటర్నెట్‌ ఉందంటూ బ్రిటిష్‌ కంపెనీ ఎంజీ గొప్పగా ప్రచారం చేసుకుంది.. టాటా, మహింద్రా కూడా తమ కారులో ఇంటర్నెట్‌ ఆధారిత టెక్నాలజీలున్నట్లు ప్రకటించాయి.. కార్లే కాదు.. ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు కూడా స్మార్ట్‌గా మారాయి. అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాల్లోనూ నెట్‌ హల్‌చల్‌ చేస్తోంది. 

ఈ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)కి కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) తోడైతే?..  
అద్భుతాలు సాధ్యమవుతాయి. చేతికి తొడుక్కునే వాచీ.. ఆరోగ్య వివరాలన్నీ సేకరించి, అత్యవసర పరిస్థితి వస్తే ఫ్యామిలీ డాక్టర్‌కు మెసేజ్‌ పెడుతుంది. పాలు పాడవుతున్నాయి.. తాజా పాలు తెచ్చుకోమని రిఫ్రిజిరేటర్‌ మనకు చెబుతుంది. సాయంత్రం ఆరు గంటలకు ఆఫీసు నుంచి వచ్చే సమయానికి వేడినీళ్లు సిద్ధంగా ఉంచమని మనమూ బాత్‌రూమ్‌లో ఉండే గీజర్‌ను ఆదేశించవచ్చు.

నగరమంతా సూర్యాస్తమయం కావడమే తడవు వీధి దీపాలు వెలిగేలా.. సూర్యోదయంతోనే ఆరిపోయేలా కూడా చేయవచ్చు. మనిషన్న వాడి అవసరం లేకుండానే.. పరిశ్రమల్లోనూ మరింత సమర్థంగా ఉత్పత్తి, యంత్రాల నిర్వహణ సాధ్యం అవుతాయి. అవన్నీ కాదు కానీ... ఇంట్లో, ఊళ్లో, ఆఫీసుల్లో యంత్రాలతో మనం పనిచేయించుకునే తీరుతెన్నుల్లో విప్లవాత్మక మార్పులు మాత్రం తథ్యం. 

మూడు టెక్నాలజీలు కీలకం.. 
ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ విజయవంతానికి, సమర్థ వినియోగానికి మూడు టెక్నాలజీలు కీలకం. 
కృత్రిమ మేథ: మనుషుల మాదిరిగానే ఇంటర్నెట్‌కు అనుసంధానమైన పరికరాలు కూడా పరిస్థితులను అర్థం చేసుకుని కొత్త విషయాలను తెలుసుకుని తదనుగుణంగా పని చేయడం ఐఓటీకి అవసరం. 

5జీ నెట్‌వర్క్‌: సెకనుకు వంద గిగాబైట్ల గరిష్ట వేగా న్ని అందుకోగల 5జీ నెట్‌వర్క్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకొస్తే.. ఐఓటీ పరికరాల నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రాసెస్‌ చేయొచ్చు. 

బిగ్‌ డేటా: ఐఓటీ కారణంగా అందుబాటులోకి వచ్చే సమాచారం వందల.. వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ సమాచారాన్ని ప్రాసెస్‌ చేసేందుకు ఇప్పుడున్న పద్ధతులు సరిపోవు. వినూత్నమైన కొత్త పద్ధతుల ద్వారా సమాచార విశ్లేషణకు ఈ బిగ్‌ డేటా టెక్నాలజీలు ఉపయోగపడతాయి. 

ఒక దశ తర్వాత ఐఓటీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కలిసి ‘ఏఐఓటీ’ అనే సరికొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. కృత్రిమ మేథ, 5జీ నెట్‌వర్క్, బిగ్‌ డేటా సాయంతో సమాచార విశ్లేషణ, వినిమయం వేగంగా, సాఫీగా సాగిపోతూ ఉంటుంది. 

నాలుగు రంగాల్లో ఏఐఓటీ.. 
వేరబుల్స్‌
స్మార్ట్‌వాచ్, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ వంటివి ఉదాహరణలు. స్మార్ట్‌వాచీల్లో ఉపయోగించే సెన్సర్ల కారణంగా గుండెకొట్టుకునే వేగం, రక్తపోటు వంటి ఆరోగ్య సంబంధిత సమాచారం తెలుస్తుంది. అలాగే వర్చు వల్‌ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ వంటి వా టిని వైద్యం, పర్యాటక రంగం తదితరాల్లో ఉపయో గిస్తున్నారు. ఇవి మరింత వృద్ధి చెందనున్నాయి.

స్మార్ట్‌హోం
ఇళ్లలోని ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా నిత్యం సమాచార సేకరణ, తదనుగుణంగా కొన్ని పనులు చక్కబెట్టడం. హోం ఆటోమేషన్‌ అనేది ఏఐఓటీలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌. కేవలం నోటి మాటతోనే టీవీ, వీడియోలు ఆన్‌ చేయడం, కిచెన్‌లో కాఫీ పెట్టడం వంటివి చేయగలగడం ఇప్పటికే కొందరికి అనుభవంలోని విషయం. 

స్మార్ట్‌ సిటీ
చెత్తకుండీల్లో ఐఓటీ సెన్సర్లు ఏర్పాటు చేశామనుకోండి.. నిండగానే తొలగించే సమయమైందని మున్సిపల్‌ సిబ్బందికి సందేశం వెళ్తుంది. నగరాల్లో ఏఐఓటీ పరికరాల ద్వారా ఒనగూరే ప్రయోజనాల్లో ఇది మచ్చుకు ఒకటి మాత్రమే. వెలుతురుకు అనుగుణంగా వీధిదీపాలను ఆన్‌/ఆఫ్‌ చేయడం, ప్రజా రవాణా మరింత మెరుగు చేయడం వంటివి కూడా స్మార్ట్‌ సిటీల ద్వారా చేయవచ్చు. ఇవన్నీ మనకు సౌకర్యం కల్పించడంతోపాటు వనరులను ఆదా చేస్తాయి కూడా. 

స్మార్ట్‌ ఇండస్ట్రీ
ఒకప్పుడు ఒక కారు తయారు కావాలంటే.. చిన్న నట్టును కూడా మనిషే బిగించాలి. రోబోల రంగ ప్రవేశంతో మనిషి అవసరం గణనీయంగా తగ్గింది. ఏఐఓటీతో ఇది మరింత వేగం పుంజుకోనుంది. ఒక్క కారు తయారీలోనే కాదు.. అన్ని రకాల పరిశ్రమల్లోనూ తెలివైన, సమాచారం ఆధారంగా పనిచేసే ఏఐఓటీ పరికరాలు మానవ తప్పిదాలకు అవకాశం లేకుండా, అతితక్కువ వనరుల వృథాతో పనులు పూర్తి చేస్తాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top