2023లో భారత్‌లో వాయు కాలుష్యంతో 20 లక్షల మంది మృతి
2000 సంవత్సరం నుంచి వాయు కాలుష్య మరణాలు 43 శాతం పెరుగుదల
సంపన్న దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు 10 రెట్లు అధికం
మతిమరుపు సమస్యలకూ కారణమవుతున్న కాలుష్యం
స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్–2025 అధ్యయన నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో 2000 సంవత్సరం నుంచి ఇటీవలి కాలం వరకు వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాలు 43 శాతం పెరిగాయని తాజా అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2023లో సంభవించిన దాదాపు 20 లక్షల మరణాలు వాయు కాలుష్యంతో ముడిపడినవేనని తేలి్చంది. ఈ మేరకు అమెరికాలోని బోస్టన్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌ఈఐ), ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఈ) స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్–2025 పేరుతో నివేదిక విడుదల చేసింది. భారత్‌లో వాయు కాలుష్య సంబంధ మరణాల రేటు అధిక ఆదాయ దేశాల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది.
భారత్‌లో ప్రతి లక్ష మందికి 186 మరణాలు సంభవిస్తుంటే సంపన్న దేశాల్లో ప్రతి లక్ష మందికి 17 మరణాలే నమోదవుతున్నాయని పేర్కొంది. 2023లో సంభవించిన వాయుకాలుష్య సంబంధ మరణాల్లో దాదాపు 89 శాతం గుండె జబ్బులు, ఊపిరితిత్తుల కేన్సర్, డయాబెటీస్ వంటి కారణంగా సంభవించాయి. 2021లో దక్షిణాసియాలో మొత్తం 26 లక్షల మంది వాయు కాలుష్యం బారినపడి మరణిస్తే వారిలో 21 లక్షల మంది భారత్‌లోనే మరణించారని నివేదిక పేర్కొంది. వాయు కాలుష్యం ఊపిరితిత్తులను దెబ్బతీయడంతోపాటు మెదడు పనితీరును సైతం క్షీణింపజేస్తోందని ఈ అధ్యయనం తేలి్చంది.
మతిమరుపు కూడా...
వాయుకాలుష్యం కేవలం శ్వాసకోశ, గుండె జబ్బులకే కాకుండా అల్జీమర్స్ వంటి మతిమరుపు సంబంధ మరణాలకు సైతం కారణమవుతున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఒక్క 2023లోనే 6.26 లక్షల మందిలో మతిమరుపుతో ముడిపడిన మరణాలకు వాయుకాలుష్యం కారణమని తేలింది. ఈ అధ్యయనం ద్వారా మతిమరుపు వ్యాధి రావడంలో వాయుకాలుష్యం సైతం కీలకపాత్ర పోషిస్తోందనే విషయం తొలిసారి తేలింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధులపై అతిసూక్ష్మ రూపాల్లోని (పరి్టక్యులేట్ మ్యాటర్–పీఎం 2.5) కాలుష్యం దీర్ఘకాలిక ప్రభావంతో ఊపిరితిత్తులు, గుండెతోపాటు మెదడుపైనా అధిక ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమైంది.
సూక్ష్మ రూపాల్లోని కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల నుంచి రక్తప్రవాహంలోకి ఎలా ప్రయాణించి మెదడును చేరి దాన్ని ఎలా దెబ్బతీస్తాయో తాజా అధ్యయనం వివరించింది. దీనిప్రకారం కాలుష్య కారకాల్లోని సూక్ష్మ కణాలు తొలుత మెదడు వాపునకు దారితీసి ఆ తర్వాత క్రమంగా మెదడు కణజాలాన్ని దెబ్బతీసి న్యూరాన్లను వేగంగా క్షీణింపజేస్తాయి. ఈ ప్రక్రియ అల్జీమర్స్, వ్యాసు్కలర్ డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ పరిస్థితులు జ్ఞాపకశక్తి, తార్కికతను క్రమంగా కోల్పోయేలా చేస్తాయి.
అలాగే వాయుకాలుష్యం వల్ల తలెత్తే మతిమరుపు సమస్య మహిళల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2021 నాటికి 6 కోట్ల మంది మతిమరుపుతో జీవిస్తున్నారని.. ఏటా కోటి కొత్త కేసులు బయటపడుతున్నాయని నివేదిక పేర్కొంది.
కాలుష్యం తగ్గుదలతో జీవితకాలం పెరుగుదల...
వాయు కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు ఆరోగ్యకరమైన జీవితకాలం పెంచుకోవచ్చని.. ఇది వాతావరణ మార్పులను మందగించేలా చేయడంలోనూ దోహదపడుతుందని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, విధాన రూపకర్తలకు ఈ అధ్యయన ఆధారాలు మేల్కొలిపేలా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
సంపూర్ణ ఆరోగ్యంలో స్వచ్ఛమైన గాలిదే కీలకపాత్ర..
అందరికీ సంపూర్ణ ఆరోగ్యం, మెరుగైన జీవన ప్రమాణాలను నిర్ధారించడంలో స్వచ్ఛమైన గాలి కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాలలో నివసిస్తున్న వారి ఆరోగ్యంపై గాలి నాణ్యత గణనీయమైన ప్రభావం చూపుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. వాయు కాలుష్యాన్ని వీలైనంత తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఈ నివేదిక దోహదపడుతుందని ఆశిస్తున్నాం. – పల్లవి పంత్, బోస్టన్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ (గ్లోబల్ ఇనీషియేటివ్స్ హెడ్)


