వైరస్‌ల విరుగుడుకు ప్రత్యేక ప్రాజెక్టు

Antiviral Mission Project To Control VIrus Says IICT Director Srinivasa Reddy - Sakshi

మోల్‌ బ్యాంక్‌ ద్వారా వాటి కట్టడిపై ప్రయోగాలు 

దోమల నివారణకు కొత్త రసాయనాల గుర్తింపు 

ల్యాబ్‌ ఫలితాల ఆధారంగా తదుపరి కార్యాచరణ 

ఐఐసీటీ డైరెక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్తులో కరోనా వంటి మహ మ్మారులను నియంత్రించేందుకు... వైరస్‌లకు విరుగుడుగా పనిచేయగల మందులను గుర్తించేందుకు యాంటీ వైరల్‌ మిషన్‌ పేరిట ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టామని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) నూతన డైరెక్టర్‌ డాక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మందులుగా ఉపయోగపడగల రసాయన పరమాణువుల బ్యాంక్‌ (మోల్‌ బ్యాంక్‌) వైరస్‌లను నాశనం చేసేందుకు ఎంత వరకు ఉపయోగపడుతుందో తెలుసుకొనేందుకు ఈ మిషన్‌ ఉపకరించనుందని తెలిపారు. అయితే గుర్తించిన మందులను పరీక్షించేందుకు బీఎస్‌ఎల్‌–3 స్థాయి పరిశోధనశాల అవసరమవుతుందని, దీని ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవలే పదవీబాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తన ప్రాథమ్యాలను వివరించారు. 

కొత్త రసాయనాలు దోమల్ని చంపేస్తాయి.. 
డెంగీ, జీకా వంటి వైరల్‌ వ్యాధులు ప్రబలేందుకు కారణ మైన దోమలను నియంత్రించేందుకు ఇప్పటికే వినూత్న రసాయనాలను గుర్తించినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న రిపెల్లెంట్ల రసాయనాల గాఢత ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. తాము గుర్తించిన కొత్త రసాయనాలు సహజసిద్ధమైన వాటిని పోలి ఉన్నందున ప్రమాదం తక్కువని... పైగా ఇవి దోమలను నిరోధించడమే కాకుండా చంపేస్తాయన్నారు.

ప్రస్తుతం పారిశ్రామిక సంస్థలతో కలసి ఈ రసాయనాలను పరీక్షించే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. ఫలితాల ఆధారంగా ముందుకు వెళ్తామన్నారు. అలాగే కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే వ్యాధులకు కొత్త మందులు కనుక్కునేందుకు సిలికాన్‌ స్విచ్‌ విధానం ఉపయోగపడుతుందన్నారు. 

యువ శాస్త్రవేత్తలూ కష్టే ఫలి... 
సమాజ హితానికి సైన్స్‌ ఎంతో ఉపయోగపడుతున్నందున శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సమాజానికి మేలు జరిగేలా చూడాలని శ్రీనివాసరెడ్డి కోరారు. యువ శాస్త్రవేత్తలు కష్టే ఫలి సిద్ధాంతాన్ని గుర్తించాలన్నారు. అవార్డులు అనేవి కష్టానికి దక్కే ప్రయోజనాలు మాత్రమే అన్నారు.  

ప్రాజెక్టు అసిస్టెంట్‌ నుంచి ఐఐసీటీ డైరెక్టర్‌ దాకా..
నల్లగొండ జిల్లా శోభనాద్రిపురానికి చెందిన సాధార ణ రైతు కుటుంబంలో పుట్టిన డాక్టర్‌ డి.శ్రీనివాసరె డ్డి దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ ఐఐసీటీ డైరెక్టర్‌ స్థానాన్ని చేపట్టడం ఒక విశేషమైతే..జమ్మూలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ మెడిసిన్, లక్నోలోని సెంట్రల్‌ డ్రగ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటం మరో విశేషం. ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పనిచేసిన ఐఐసీటీకే ఆయన డైరెక్టర్‌గా రావడం గమనార్హం. 

సూపర్‌వైజర్‌నైతే చాలనుకున్నా... 
‘రైతు కుటుంబంలో పుట్టిన నేను టెన్త్‌ వరకు రామన్నపేటలో, ఇంటర్‌ సికింద్రాబాద్‌లోని మహబూబ్‌ కాలేజీలో, బీఎస్సీ (బీజెడ్‌సీ) సర్దార్‌ పటేల్‌ కాలేజీలో చేశా. ఖర్చులకు అవసరమైన డబ్బు సంపాదన కోసం వార్తాపత్రికల పంపిణీ, హోం ట్యూషన్లు, కట్టెల మండీలో పని చేశా. ఆ దశలోనే ఓ సూపర్‌వైజర్‌నైతే చాలనుకున్నా. నిజాం కాలేజీలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ తర్వాత పీహెచ్‌డీ చేద్దామనుకున్నా ఫెలోషిప్‌ లేక ఐఐసీటీలో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా చేరా.

కొంతకాలానికి సీఎస్‌ఐఆర్‌ నెట్‌ పరీక్ష పాసై ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ మెహతా వద్ద పీహెచ్‌డీ (సెంట్రల్‌ యూనివర్సిటీ) చేశా. షికాగో, కాన్సస్‌ యూనివర్సిటీల్లో చదువుకున్నాక భారత్‌కు తిరిగి వచ్చి పలు ప్రఖ్యాత సంస్థల్లో పనిచేశా. ఆపై విద్యాబోధన వైపు మళ్లా. 2010లో పుణేలోని నేషనల్‌ కెమికల్‌ లేబొరేటరీలో చేరా. 2020లో జమ్మూలోని ఐఐఐఎంకు డైరెక్టర్‌గా ఎంపికయ్యా’ అని డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top