నెలకు లక్ష జీతం.. సాఫ్ట్‌వేర్‌ వదిలి ‘సాగు’లోకి..

Adilabad District: Techie Leaves Job to Turn Guava Farmer, Earns Lakhs - Sakshi

వ్యవసాయంలో రాణిస్తున్న యువకుడు

జామ సాగుతో లాభాలు గడిస్తున్న రైతు

కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం

నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అన్వేశ్‌

తాంసి (ఆదిలాబాద్ జిల్లా): నెలకు రూ.లక్ష జీతం తీసుకుంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం మానేశాడు. తన భూమిలో విభిన్న పంటలను సాగుచేస్తూ నలుగురు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాడు. జిల్లా కేంద్రానికి చెందిన కోదే అన్వేశ్‌ ఎంటెక్‌ వరకు చదివాడు. 2016 నుంచి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాడు. వెబ్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా 2016 నుంచి 2019 వరకు పని చేశాడు. నెలకు రూ.లక్ష జీతం వస్తున్నా సంతృప్తి చెందలేదు. ఉద్యోగం వదులుకొని తనకు నచ్చిన వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. నాలుగేళ్లుగా తాంసి మండలం సావర్గాం గ్రామశివారులోని ఎనిమిదెకరాల సొంత భూమిలో వివిధ పంటలను సాగు చేస్తూ లాభాలను గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.


మొదటగా నష్టాలు చవిచూసి..

హైదరాబాద్‌ నుంచి వచ్చిన అన్వేశ్‌ మొదటి సంవత్సరం పత్తి, జొన్న సాగు చేశాడు. పత్తి, జొన్న సాగుతో కూలీల కొరత, కష్టం ఎక్కువగా ఉండడంతో నష్టాలను చవిచూశాడు. ఏ మాత్రం కుంగిపోకుండా ఇతర పంటలను సాగుచేసి లాభాలను పొందాలని నిర్ణయించుకున్నాడు. ఏ పంటలను సాగుచేస్తే మేలని వ్యవసాయశాఖ అధికారుల సూచనలు తీసుకున్నాడు. స్నేహితుల సలహాలు తీసుకొని పంటలను సాగుచేస్తున్నాడు.


అధికారుల సూచనలు పాటించి..

2019లో హార్టికల్చర్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సలహాతో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి నుంచి థైవాన్‌ జామ మొక్కలను తెప్పించాడు. రూ.2.50 లక్షల వరకు ఖర్చుచేసి నాలుగెకరాల్లో ఎకరాకు వెయ్యి చొప్పున నాటించాడు. మొక్కలను హైడెన్సిటీ విధానంతో ఆరు అడుగులకు ఒక్కటి చొ ప్పున ఉండేలా చూశాడు. రసాయన మందులు లే కుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేశాడు. దీంతో మొక్కలను నాటిన 18 నెలలకే కాత ప్రారంభమైంది. సేంద్రియంగా పెంచిన జామపండ్లను పంటచేను పక్కనే ఉన్న రోడ్డు పక్కన షెడ్డు వేసి రూ.50కి కిలో చొప్పున విక్రయిస్తున్నాడు. పెద్దఎత్తున దిగుబడి వచ్చినప్పుడు బయటి మార్కెట్‌కు కూడా తరలిస్తున్నాడు. జామ ద్వారా మొదటి సంవత్సరం రూ.రూ.2.50 లక్షల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం కాత ఎక్కువగా ఉండగా రూ.3 లక్షల వరకు వస్తుందని అన్వేశ్‌ చెబుతున్నాడు.


షెడ్లు వేసి కోళ్లు పెంచుతూ..  

జామతోటతో అంతరసాగు విధానంలో వివిధ పంటలు వేశాడు. దీనికి తోడు పంటచేనులో ప్రత్యేక షెడ్లు వేసి రెండేళ్లుగా నాటు, కడక్‌నాథ్, గిరిరాజా కోళ్లు, బాతులను పెంచుతున్నాడు. వాటిని విక్రయిస్తూ అదనపు లాభాలను గడిస్తున్నాడు. వచ్చే సంవత్సరం నుంచి బ్రాయిలర్‌ కోళ్ల పెంపకం చేపట్టనున్నట్లు అన్వేశ్‌ తెలిపాడు. ఇప్పటినుంచే షెడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కన్నా ఇక్కడే తృప్తిగా, ప్రశాంతంగా ఉన్నట్లు చెబుతున్నాడు.


వ్యవసాయంలోనే సంతృప్తి

నేను ఎంటెక్‌ పూర్తిచేశా ను. మూడేళ్లపాటు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యో గం చేశాను. జీతం సరిప డా వచ్చినా ఉద్యోగంపై ఆసక్తి లేక మానేశాను. మాకున్న భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్న. నాన్న శ్రీనివాస్‌ సాయంతో మూడేళ్ల క్రితం వ్యవసాయం ప్రారంభించాను. ప్రస్తుతం వి విధ పంటలతోపాటు జామ సాగు చేపట్టా ను. అలాగే వివిధ రకాల కోళ్ల పెంపకం చేప ట్టి అదనపు ఆదాయాన్ని పొందుతున్న. రోజూ పంటచేనులో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నాతోపాటు నిత్యం నలుగురు కూలీలకు పని కల్పించడం సంతృప్తినిస్తోంది.
– కోదే అన్వేశ్, యువరైతు  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top