అంతరిక్ష ప్రయోగాల్లో నవశకం

Active Experiments In Space: The Future - Sakshi

ఆకాశం అంచులు దాటి అంతరిక్షానికి ఎగిరిపోవాలన్న మనిషి కలకు వందల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని గత 60 ఏళ్లలో దాదాపు 600 మంది ఈ ఘనతను సాధించగలిగారు. కోటీశ్వరులు ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా అమెరికా, యూరప్‌లలోని ప్రభుత్వరంగ సంస్థలు పంపిన వారే. ఇప్పటిదాకా సామాన్యులు అంతరిక్షానికి వెళ్లేందుకు రూ. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడం ప్రధాన అడ్డంకిగా నిలిచేది.

ఈ ఏడాది జూలైలో వర్జిన్‌ గెలాక్టిక్‌ అధిపతి రిచర్డ్‌ బ్రాస్నన్, అమెజాన్‌ యజమాని జెఫ్‌ బెజోస్‌లు పోటాపోటీగా అంతరిక్ష పర్యటనలు చేయగా తాజాగా స్పేస్‌–ఎక్స్‌ సిద్ధం చేసిన అంతరిక్ష ప్రయోగంలో మాత్రం సామాన్యులకూ చోటుదక్కింది. 

ప్రయోగం ఎప్పుడు? ఎక్కడ? 
అమెరికా ఫ్లోరిడాలోని కేప్‌ కానెర్వాల్‌లో ఉన్న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 15న స్పేస్‌–ఎక్స్‌ అంతరిక్ష ప్రయోగం జరగనుంది. స్పేస్‌–ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌–9 హెవీ రాకెట్‌... వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్‌ను భూకక్ష్యలోకి తరలించనుంది. ‘‘ఇన్‌స్పిరేషన్‌ 4’పేరుతో చేపట్టనున్న ఈ ప్రయోగంలో భాగంగా నలుగురిని అంతరిక్ష విహారానికి తీసుకెళ్లనున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ప్రయోగ ఖర్చులన్నింటినీ అమెరికా కోటీశ్వరుడు, ‘షిఫ్ట్‌–4’పేమెంట్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ సీఈవో జేర్డ్‌ ఐసాక్‌మాన్‌ భరిస్తున్నారు. ఆయన ఎంత మొత్తం స్పేస్‌–ఎక్స్‌కు చెల్లించారన్న విషయం స్పష్టంగా తెలియకున్నా ఇది రూ. వందల కోట్లలో ఉండొచ్చని అంచనా. విమాన పైలట్‌గానూ పనిచేసిన అనుభవం ఐసాక్‌మాన్‌కు ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. 


అంతరిక్షంలోకి వెళ్తున్న క్రిస్, సియాన్, ఐసాక్‌మాన్, హేలీ (ఎడమ నుంచి వరుసగా) 

ఎంపిక, శిక్షణలు ఇలా... 
ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పేస్‌–ఎక్స్‌ వ్యోమగాముల ఎంపిక ప్రకటన చేసింది. ఆ తరువాత అత్యధిక గురుత్వాకర్షణ శక్తి ఉన్న ప్రాంతాల్లో వారికి శిక్షణ ఇచ్చింది. భారరహిత స్థితిని పరిచయం చేసేందుకు వ్యోమగాములను అర్ధచంద్రాకారం ఆకారంలో విమానంలో విప్పింది. ఇలా తిప్పినప్పుడు కొన్ని సెకన్లపాటు శరీరం బరువు మనకు తెలియదు. రోలర్‌ స్కేటర్‌లో ఎత్తు నుంచి కిందకు జారుతున్నప్పుడు కలిగే అనుభూతి అన్నమాట.

ఇన్‌స్పిరేషన్‌–4ను భూకేంద్రం నుంచే నియంత్రిస్తూంటారు. మూడు రోజుల అంతరిక్ష ప్రయాణం మొత్తమ్మీద వ్యోమగాముల నిద్ర, గుండె కొట్టుకునే వేగం, రక్తంలో వచ్చే మార్పులు, మేధో సామర్థ్యం వంటి అనేక అంశాలను నిశితంగా పరిశీలిస్తారు. భవిష్యత్తులో సాధారణ పౌరులతో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయని అంచనా. 

స్ఫూర్తి నింపే ప్రయోగం... 
‘ఇన్‌స్పిరేషన్‌–4’ ప్రయోగం స్ఫూర్తివంతమైన దనీ చెప్పాలి. ఎందుకంటే ఈ అంతరిక్ష నౌకలో ప్రయాణించే వారిలో ఒకరు కేన్సర్‌ బారినపడి కోలుకున్న 29 ఏళ్ల హేలీ అర్సెనాక్స్‌ ఉన్నారు. మెంఫిస్‌(అమెరికా)లోని సెయింట్‌ జూడ్‌ పిల్లల ఆసుపత్రిలో హేలీ సహాయకురాలిగా పనిచేస్తున్నారు. ఇన్‌స్పిరేషన్‌–4లో భాగంగా ఐసాక్‌ మ్యాన్‌ ఈ ఆస్పత్రిని చారిటబుల్‌ బెనిఫిషరీ (లబ్ధిదారు)గా ఎంపిక చేశారు.

హేలీ ఎంపిక ‘రేపటిపై ఆశ’లేదా ‘హోప్‌’కు ప్రతీకని ఐసాక్‌మ్యాన్‌ అంటున్నారు. ఈ ప్రయోగంతో సెయిం ట్‌ జూడ్‌ పిల్లల ఆస్పత్రిపై ప్రజల్లో అవగాహన కల్పనతోపాటు ఆస్పత్రికి 200 మిలియన్‌ డాలర్ల నిధులను సేకరించాలని భావిస్తున్నారు. హేలీతోపాటు అంతరిక్షానికి వెళుతున్న వారిలో 42ఏళ్ల క్రిస్‌ సెంబ్రోస్కీ ఉన్నారు. అమెరికా వాయుసేనలో సేవలం దించి పదవీవిరమణ చేసిన ఆయన... ప్రస్తు తం వైమానికరంగంలో పనిచేస్తున్నారు. ‘దాతృ త్వం’లేదా జెనరాసిటీకి ప్రతీకగా క్రిస్‌ ఎంపిక జరిగింది.

చివరగా ‘సమృద్ధి’ అన్న భావనను గుర్తుచేసుకునేందుకు 51 ఏళ్ల భూగర్భ శాస్త్రవేత్త సియాన్‌ ప్రాక్టర్‌ను ఎంపిక చేశామని, 2009లో ‘నాసా’తరఫున వ్యోమగామి అవ్వాల్సిన చాన్స్‌ సియాన్‌కు తృటిలో తప్పిందని ఐసాక్‌మ్యాన్‌ వివరించారు. అంతరిక్షానికి వెళ్లిన నాలుగవ ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళగానూ సియాన్‌ రికా ర్డు సృష్టించనున్నారు. ఇన్‌స్పిరేషన్‌–4 కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా ఐసాక్‌మ్యాన్‌ వ్యవహరించనున్నారు. 

ఐసాక్‌మ్యాన్‌ ఎవరు? 
16 ఏళ్లకే బడి మానేసి.. రూ.18 వేల కోట్లకు అధిపతిగా.. జేర్డ్‌ ఐసాక్‌మ్యాన్‌.. వయసు 38 ఏళ్లే. కానీ ఘనతలు ఎన్నో. 1983లో అమెరికాలోని న్యూజెర్సీలో పుట్టాడు. చిన్నవయసులోనే కంప్యూటర్‌ రిపేరింగ్, సాఫ్ట్‌వేర్‌ సర్వీసులపై పట్టు సాధించాడు. తన 16వ ఏట స్కూల్‌ మానేసి.. ఉద్యోగంలో చేరిపోయాడు. 2005లో సొంతంగా ‘యునైటెడ్‌ బ్యాంక్‌ కార్డ్‌ (ప్రస్తుత పేరు: ఫిఫ్ట్‌4 పేమెంట్స్‌)’పేరిట రిటైల్‌ పేమెంట్‌ సొల్యూషన్స్‌ కంపెనీ స్థాపించాడు.

దాన్ని అమెరికా వ్యాప్తంగా విస్తరించాడు. ఇదే సమయంలో తనకు బాగా ఇష్టమైన పైలట్‌ శిక్షణ తీసుకున్నాడు. 2009లో ఏకంగా భూమిని చుట్టేస్తూ.. 61 గంటలపాటు విమానం నడిపి రికార్డు సృష్టించాడు. ఆ ఫీట్‌తో సుమారు లక్ష డాలర్లు సేకరించి మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌కు అందజేశాడు.

2011లో ఏరోనాటిక్స్‌ డిగ్రీ పూర్తిచేసిన ఐసాక్‌మ్యాన్‌.. 2012లో ఏకంగా ‘డ్రాకెన్‌ ఇంటర్నేషనల్‌’ పేరిట యుద్ధ విమాన పైలట్‌ శిక్షణ సంస్థను స్థాపించాడు. ప్రపంచంలో సొంతంగా యుద్ధ విమానాలు ఉన్న పెద్ద ప్రైవేటు ఎయిర్‌ఫోర్స్‌ సంస్థ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం ఐసాక్‌మ్యాన్‌ ఆస్తులు సుమారు రూ.18 వేల కోట్లకుపైనే ఉంటాయని అంచనా.  
– సాక్షి, హైదరాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top