తెలంగాణలో ‘నో క్యాస్ట్‌’... 12 లక్షల మంది | 1. 2 Million People individuals who chose not to identify with any caste: Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ‘నో క్యాస్ట్‌’... 12 లక్షల మంది

Apr 17 2026 5:25 AM | Updated on Apr 17 2026 5:37 AM

1. 2 Million People individuals who chose not to identify with any caste: Telangana

రాష్ట్రంలో పదో లార్జెస్ట్‌ కమ్యూనిటీగా గుర్తింపు...రాష్ట్ర జనాభాలో 3.4 శాతం

ప్రధానంగా హైదరాబాద్‌ మహానగరంలోనే

అయితే కొన్ని కులాల పేర్లు ఏ కేటగిరీలోనూ లేక ‘నో క్యాస్ట్‌’గానూ పరిగణన

ఎస్‌ఈఈఈపీసీ–2024 నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ‘నో క్యాస్ట్‌’ కేటగిరీని 12 లక్షల మంది ఎంచుకున్నారు. వీరు రాష్ట్రంలో ‘టెన్త్‌ లార్జెస్ట్‌ కమ్యూనిటీ’గా గుర్తింపు పొందడంతోపాటు 3.55 కోట్ల సర్వే జనాభాలో 3.4 శాతంగా నిలిచారు. తెలంగాణ కుల సర్వేలో ‘కులం లేదు’లేదా ‘కుల రహిత’అనేది సాంప్రదాయక కులం లేదా మతంతో తమను తాము గుర్తించుకోవడానికి ఇష్టపడని వ్యక్తుల కోసం ఉద్దేశించిన ఒక ఎంపికను సూచిస్తోంది. ఇది వారి గుర్తింపును ‘కులం లేదు’లేదా ‘మతం లేదు’అని స్పష్టంగా నమోదు చేయడానికి అనుమతిస్తుంది. ‘కులరహిత’అని చెప్పుకునే వారిలో 73% కంటే ఎక్కువ మంది గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో, ముఖ్యంగా సంపన్న పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

మిగతావారు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, నిర్మల్, హనుమకొండ, ఆసిఫాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో స్వల్పసంఖ్యలోనే ఉన్నారు. ఆసక్తికరంగా ఉన్నదేమిటంటే... ఈ సమూహంలో 43% మంది వాస్తవానికి కుల ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉన్నారని, 13.5% మంది సర్వేలో తమ కుల గుర్తింపును వదులుకోవడానికి ముందు రిజర్వేషన్‌ ప్రయోజనాలను పొందారని నివేదిక వెల్లడించింది. తెలంగాణ సామాజిక–ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో... ఏ నిర్దిష్ట కులానికి తమను తాము గుర్తించుకోవడానికి ఇష్టపడని పౌరుల కోసం ‘నో క్యాస్ట్‌’అనేది ఒక అధికారిక ఎంపిక. 2024 నవంబర్‌లో నిర్వహించిన సర్వేలో ’కుల రహితం’, ’మత రహితం’ అనే కాలమ్‌లను చేర్చాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 (1), ఆర్టికల్‌ 25 (1) పౌరులకు నిర్దిష్ట కులాన్ని లేదా మతాన్ని ప్రకటించుకోకుండా జీవించే హక్కును కల్పిస్తాయని కోర్టు గుర్తించింది. ఇది ‘మనస్సాక్షి స్వేచ్ఛ’ను ప్రతిబింబిస్తుంది, సాంప్రదాయ కుల, మత గుర్తింపును అధికారికంగా తిరస్కరించడానికి వ్యక్తులను అనుమతిస్తుంది. అయితే కొన్ని కులాల పేర్లు సర్వేలోని ఏ కేటగిరీలోనూ లేకపోవడంతో ‘నో క్యాస్ట్‌’గానూ పరిగణించినట్టుగా తెలుస్తోంది. ఈ గుర్తింపులను నిర్దేశిత కోడ్‌లతో (ఉదాహరణ... షెడ్యూల్‌ నం. 5 కింద ‘మతం లేదు’కోసం కోడ్‌ నం. 07) సర్వేలో నమోదు చేయాలని కోర్టు ప్రత్యేకంగా ఆదేశించింది. ఇందులో షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ), వెనుకబడిన తరగతులు (బీసీ), ఇతరులు వంటి ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి.

తద్వారా ఇది ఒక నిర్దిష్ట కులానికి తమను తాము గుర్తించకుండానే సర్వేలో పాల్గొనడానికి ప్రజలకు ఒక మార్గాన్ని అందించడంతోపాటు పెరుగుతున్న అలాంటి వ్యక్తుల సంఖ్యను గుర్తింపునకు ఇది తోడ్పడుతోంది. సంపన్న, పట్టణ ప్రాంతాల నివాసితులు ఈ ఎంపికను ఎక్కువగా ఉపయోగించారని గణన అధికారులు గుర్తించారు. పేదరికం సాధారణంగా సామాజిక గుర్తింపుతో ముడిపడి ఉందని (ఎస్సీ, ఎస్టీ వర్గాలు గణనీయంగా వెనుకబడినవిగా ఉన్నాయని) సర్వేలో తేలినా, అనేక అభివృద్ధి సూచికల ప్రకారం రాష్ట్రంలో అతి తక్కువ వెనుకబడిన వర్గాల్లో‘కులరహిత’సమూహం ఒకటిగా గుర్తింపు పొందడం విశేషం. ఈ సమూహం రాష్ట్రంలో అతి తక్కువ వెనుకబడిన వర్గాలలో ఒకటి కాగా... వీరి కాంపోజిట్‌ బ్యాక్‌వర్డ్‌నెస్‌ ఇండెక్స్‌ (సీబీఐ) స్కోరు 48 (రాష్ట్ర సగటు 81 కంటే చాలా తక్కువ). వారికి సాధారణంగా విద్య, ప్రైవేట్‌ రంగ ఉద్యోగాలు ప్రాథమిక సేవలు మెరుగైన రీతిలో అందుబాటులో ఉన్నట్టుగా తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement