వేలూరు: వేలూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుడియాత్తం గంగమ్మ శిరస్సు జాతర ఈనెల 15వ తేదిన అతి వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాలను వేలూరు జిల్లా నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన ఆదివారం రాత్రి పుష్పపల్లకి ఉత్సవం అతి వైభవంగా జరిగింది. ముందుగా గుడియాత్తం గోపాలపురం యువజన సంఘం ఆధ్వర్యంలో శివలింగం, వినాయకుడి స్వామిలను అలంకరించి పుష్పపల్లకిలో ఆశీనులను చేశారు. అప్పటికే పల్లకిలో ఉంచిన అమ్మవారిని పుష్పాలతో అలంకరించడంతో పాటూ పల్లకిలను మల్లెపూలతో అలంకరించారు. అదే విధంగా గుడియాత్తం తండ్రాంబట్టు పూల వ్యాపారుల సంఘం అద్వర్యంలో 69వ సంవత్సర పుష్పపల్లకి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పల్లకిని సుమారు 14 అడుగుల ఎత్తులో అలంకరించడంతో భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారికి కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలా ఉండగా రాత్రి పూర్తిగా ఐదు పుష్ప రథాలు గుడియాత్తంలోని పలు వీధుల్లో తిరిగాయి. ఈ పుష్ప పల్లకిల ముందు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో భక్తులను ఆకట్టుకుంది.


