తమిళసినిమా: మండవెట్టి చిత్రంలో నటి కోమలి ప్రసాద్ విలక్షణ నటనను ప్రదర్శించారని ఆ చిత్ర దర్శకుడు చరణ్‌రాజ్ సెంథిల్‌కుమార్ అన్నారు. టస్కర్స్ డెన్ పిక్చర్స్ పతాకంపై ఈయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం మండవెట్టి. ఈ చిత్రం గురించి మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో దర్శకుడు తెలుపుతూ ఇది సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. ఇందులో నటి కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. ఆమె పాత్ర ఆవేశం, ఆవేదనతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్‌తో సాగుతుందన్నారు. ఈ పాత్రకు చక్కని భావోద్రేకాలను వ్యక్తం చేయడంతో పాటు ధైర్యాన్ని ప్రదర్శించగల నటి అవసరం అవుతుందని భావించానని, అలాంటి పాత్రలో నటి కోమలి ప్రసాద్ అంకితభావంతో నటించి, జీవించారని ,శారీరకంగానూ చాలా కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ చిత్రం క్రైమ్ ధ్రిల్లర్ కథా చిత్రం అయినా కొన్ని ప్రాచీన కాల వాస్తవ ఘటనలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. పాత కాలానికి చెందిన తన గురించి తెలుసుకునే ఓ యువతి కథా చిత్రమే మండవెట్టి అని చెప్పారు. చెంజి అనే గ్రామీణ దేవత ఇతివృత్తంతో పలు రహస్యాలతో కూడిన పురాణ ఘటనలు ఈ చిత్రంలో చోటు చేసుకుంటాయని చెప్పారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కాగా ఈ చిత్రానికి ఈ చిత్రానికి దీపక్ వేణుగోపాల్ సంగీతాన్ని, ప్రకాశ్ మనిదన్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు.


