తమిళసినిమా: దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గురించి తెలియని వారు ఉండరు. ఇకపోతే సంగీతజ్ఞాని ఇళయరాజా గురించి చెప్పాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఇంతకు ముందు పిజా, జిగర్తండా, ఇరైవి, మెర్కూరి,పేట, జగమేతందిరం, జిగర్తండా డబుల్ ఎక్స్, మహాన్, రెట్రో మొదలగు 9 చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. తాజాగా తన 10వ చిత్రానికి రెడీ అవుతున్నారు. వీటిలో 8 చిత్రాలకు సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందించారు. కాగా ఇప్పటి వరకు 1,540 చిత్రాలకు సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు ఇళయరాజా. అయితే కార్తీక్ సుబ్బరాజ్ చిత్రానికి ఈ సంగీతజ్ఞాని ఇప్పటి వరకూ సంగీతాన్ని అందించలేదు. అయితే సందర్భం వచ్చినప్పుడల్లా కార్తీక్ సబ్బురాజ్ ఇళయరాజా సంగీతాన్ని తన చిత్రాల్లో వాడుతుంటారు. అలాంటిది ఇప్పుడు వీరి రేర్ కాంబినేషన్‌లో ఒక చిత్రం రూపొందనుందన్నది తాజా సమాచారం. దీని గురించి దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ కల 10, ఆశీర్వాదం 1,540 అని తన ఎక్స్‌మీడియాలో పోస్ట్ చేశారు. అంటే కార్తీక్‌సుబ్బరాజ్ కలల చిత్రం అయిన తన 10వ చిత్రానికి 1,540 చిత్రాల సంగీతదర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందించనున్నారని చెప్పకనే చెప్పారన్నమాట. అంతే కాకుండా ఈ చిత్రానికి పాటల రికార్డింగ్ ప్రారంభం అయ్యింనట్లుంది. ఇళయరాజాతో దిగిన ఫొటోలను కార్తీక్‌సుబ్బరాజ్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.


