పుదుచ్చేరి ప్రొటెం స్పీకర్‌గా.. అన్బళగన్‌ ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి ప్రొటెం స్పీకర్‌గా.. అన్బళగన్‌ ప్రమాణ స్వీకారం

May 19 2026 4:50 AM | Updated on May 19 2026 4:50 AM

● 20న అసెంబ్లీ సమావేశం

సాక్షి, చైన్నె : కేంద్రపాలిత ప్రాంత పుదుచ్చేరి శాసనసభ తాత్కాలిక సభాపతి (ప్రొటెం స్పీకర్‌) గా ఎమ్మెల్యే అన్బళగన్‌ నియమితులయ్యారు. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం ఈనెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశం కానున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. వివరాలు.. రాజ్‌ నివాసంలోని దర్బార్‌ హాల్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కై లాష్‌నాథన్‌.. అన్బళగన్‌ చేత ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, మంత్రి నమశ్శివాయం, మల్లాడి కృష్ణ్ణారావు, ఎంపీ సెల్వగణపతి పాటు ఎన్‌.ఆర్‌.కాంగ్రెస్‌, బీజేపీ, డీఎంకే, టీవీకే, ఎల్‌జెపి, నేయన్‌ మక్కల్‌ కజగం పార్టీల ఎమ్మెల్యేలు స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ప్రమాణ స్వీకారం అనంతరం అన్బళగన్‌ అసెంబ్లీలోని స్పీకర్‌ ఛాంబర్‌కు చేరుకుని, సీఎం రంగస్వామి ఆశీస్సులు తీసుకుని తన సీట్లో ఆశీనులయ్యారు.

20న అసెంబ్లీ

ప్రమాణ స్వీకారం అనంతరం ప్రొటెం స్పీకర్‌ అన్బళగన్‌ విలేకరులతో మాట్లాడారు. పుదుచ్చేరి 16వ శాసనసభకు కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవం ఈనెల 20వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభ మవుతుందన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇంటర్నెట్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారంచేస్తామన్నారు. ప్రజలు చూసేందుకు వీలుగా ముఖ్య కూడళ్లలో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

సీఎం రంగస్వామి రాజీనామా

ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసి గెలిచిన ముఖ్యమంత్రి రంగస్వామి.. నిబంధనల ప్రకారం తన తట్టాంచావడి నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లేఖ అందించారు. దీనిపై చట్టపరంగా పరిశీలించి తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించచారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత, ముఖ్యమంత్రి సలహా మేరకు శాశ్వత స్పీకర్‌ ఎన్నిక తేదీని ప్రకటించనున్నారు. కాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఫోన్‌ ద్వారా అన్భలగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement