బరువెక్కిన హృదయంతో.. పార్టీని వీడుతున్నా! | - | Sakshi
Sakshi News home page

బరువెక్కిన హృదయంతో.. పార్టీని వీడుతున్నా!

May 19 2026 4:50 AM | Updated on May 19 2026 4:50 AM

● అన్నాడీఎంకే మాజీ మంత్రి సెమ్మలై ప్రకటన

సాక్షి, చైన్నె: తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి మరో గట్టి షాక్‌ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సెమ్మలై అన్నాడీఎంకేకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి సోమవారం పంపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆంగ్ల పత్రికల హేళన

పార్టీ అంతర్గత కలహాల వల్ల బజారున పడుతోందని ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు సైత పరిహాసం ఆడుతుంటే మనసు తల్లడిల్లిపోతోందన్నారు. ’కర్పూరం కరిగిపోవచ్చు.. కానీ పార్టీ ఇలా కరిగిపోవాలా?’ అన్నదే నా అంతరాత్మ ఘోష‘ అని లేఖలో రాశారు.

అవకాశాలు నిరాకరించినా

జయలలిత మరణం తర్వాత తనకు పార్టీలో చాలా అవకాశాలు నిరాకరించబడ్డాయని, తొక్కిపెట్టే ప్రయత్నం జరిగిందని, అయినా తాను క్రమశిక్షణ గల కార్యకర్తగా లాయల్టీతో పనిచేశానని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత వాతావరణం చూస్తుంటే పార్టీలో కొనసాగడానికి మనస్సాక్షి అంగీకరించడం లేదన్నారు. రాజకీయాల్లో తనకు గుర్తింపునిచ్చిన ఆ ఇద్దరు గొప్ప నేతల ఆత్మలను క్షమాపణలు కోరుకుంటూ.. బరువెక్కిన హృదయంతో పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని సెమ్మలై పేర్కొన్నారు.

సీఎం విజయ్‌ గురించి ప్రస్తావన

ప్రస్తుత ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌.. అన్నాడీఎంకేను కనీసం ఒక పార్టీగా కూడా పరిగణించడం లేదన్నారు. దానికి ఆయనను తప్పుపట్టలేమన్నారు. పార్టీని ఒక బలమైన శక్తిగా చూపించడంలో ప్రస్తుత అన్నాడీఎంకే నాయకత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఎన్నికల ఓటమికి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కారణమనే విమర్శలను సెమ్మలై తోసిపుచ్చారు. ఆయన ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడి ప్రచారం చేశారని, కేవలం అంతర్గత కుమ్ములాటల వల్లే పార్టీ ఓడిపోయిందని స్పష్టం చేశారు. అలాగే మాజీ మంత్రి ఎస్‌.పి.వేలుమణి వెనుక బీజేపీ ఉందనే ఆరోపణలను కూడా ఆయన కొట్టిపారేశారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో అన్నాడీఎంకేలోని ఈ అంతర్గత సంక్షోభం మరియు సీనియర్‌ నేత సెమ్మలై నిష్క్రమణ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా అన్నాడీఎంకేలో పళణి స్వామి, సీవీ షణ్ముగం, ఎస్పీవేలుమణి శిబిరాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. పార్టీ కార్యాలయాలకు తాళాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఆపార్టీ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి.

పార్టీ పరిస్థితిపై ఆందోళన

ఎన్నికల తర్వాత పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన నాటి నుండి రక్తం ధారపోసిన లక్షలాది మంది కార్యకర్తలు కూడా ఇదే మానసిక స్థితిలో ఉన్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌ నిర్మించిన, జయలలిత కాపాడిన ఈ గొప్ప జాతీయ ఉద్యమానికి ఇలాంటి పరిస్థితి రావాలా? అని ప్రశ్నించారు.

విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు

రాజీనామా అనంతరం సెమ్మలై మీడియాతో మాట్లాడారు. నాయకుల ’ఈగో’నే పెద్ద మైనస్‌గా అభివర్ణించారు. పార్టీ రోజురోజుకూ బలహీనపడిపోతోంది. దానిని బలోపేతం చేయాలనే ఆలోచన నేటి ముఖ్య నాయకులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే.. అధికారం కోసం ముఖ్య నేతల మధ్య ఉన్న ’ఈగో’ (అహంకారం). ఈ ఈగోనే పార్టీ ఎదుగుదలకు స్పీడ్‌ బ్రేకర్‌ లా మారిందని ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement