సాక్షి, చైన్నె : ‘‘సామాజిక న్యాయం, పెరియార్ సిద్ధాంతాల నేల అని తమిళనాడును చెప్పుకుంటున్నప్పటికీ, ఇక్కడ ఇప్పటికీ కుల వివక్ష బిగుసుకు పోయిన వాస్తవం నుండి పూర్తిగా బయటపడలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఒక దళితుడు ముఖ్యమంత్రిగా అవతరించడం అంత సులభం కాదు’’ అని వీసీకే అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్ వ్యాఖ్యానించారు. సోమవారం చైన్నెలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉద్వేగ భరిత వ్యాఖ్యలు చేశారు. తమిళ రాజకీయాల్లో కుల ఆధారిత వాస్తవాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇక్కడి పరిస్థితులు నాకు బాగా తెలుసు. ఎవరో ఊహాత్మకంగా చెప్పిన మాటలను నమ్మి నేను రాజకీయ నిర్ణయాలు తీసుకోను’’ అని స్పష్టం చేశారు.
డీఎంకే–అన్నాడీఎంకే కూటమిపై వివరణ
ఈ రెండు పార్టీల మధ్య కూటమి ఏర్పాటుపై అధికారికంగా ఎవరూ తనతో చర్చించలేదని చెప్పారు. అయితే రాజకీయ వర్గాల్లో అలాంటి చర్చలు గుసగుసల రూపంలో వినిపించాయని వెల్లడించారు. ప్రస్తుతం తాము డీఎంకే కూటమిలోనే కొనసాగుతున్నామని, ఈనేపథ్యంలో డీఎంకే నాయకత్వాన్ని ఎప్పుడైనా కలిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
టీవీకే ప్రభుత్వానికి నిబంధనలేని మద్దతు
సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు తాము వెలుపల నుంచి నిబంధనలేని మద్దతు అందించామని తిరుమావళవన్ తెలిపారు. ‘‘ఇద్దరు ఎమ్మెల్యేల కొరత కారణంగా ప్రభుత్వం ఏర్పడకుండా పోకూడదు. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు రావడం లేదా రాష్ట్రపతి పాలన విధించబడటం వంటి పరిస్థితులు తలెత్తకూడదనే ఉద్దేశంతో తాము ఈ మద్దతు ఇచ్చామన్నారు. అయితే మంత్రివర్గంలో భాగస్వామ్యం కావాలనే ఆలోచన తకు లేదు అని చెప్పారు.
పదవుల కోరిక ఉంటే ముందే మద్దతు ఇచ్చేవాళ్లం’
పదవుల కోసం రాజకీయాలు చేయడం తమ లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తమకు అధికార ఆశ ఉండి ఉంటే, ముందే టీవీకేకు మద్దతు ప్రకటించేవాళ్లమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి దగ్గరగా ఉన్నవారు అని విమర్శించిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, మద్దతు ప్రకటించే ముందు కూడా ఈ అభిప్రాయాన్ని టీవీకే నాయకత్వానికి తెలియజేశానన్నారు. తమిళ రాజకీయాల్లో కుల వాస్తవాలపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం గురించి ఎంత చెప్పుకున్నా, క్షేత్రస్థాయి వాస్తవాలు వేరేలా ఉన్నాయి. అందుకే తమిళనాడులో ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడం ఇప్పటికీ కఠినమైన రాజకీయ లక్ష్యంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.


