సాక్షి, చైన్నె : ‘సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించుకుని, చిన్న పిల్లల ద్వారా వాళ్ల ఇళ్లలోని పెద్దలను, తల్లిదండ్రులను ప్రభావితం చేసి, పక్కా ప్లాన్‌తో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు..ఈ విషయం మన కంటికి కనిపించకుండా పోయింది’ అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. తంజావూరులో జరిగిన పూండి కలైవాణన్ కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న స్టాలిన్.. ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి, తమిళగ వెట్రి కళగం విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
డీఎంకే శకం ముగిసిపోలేదు
ఎన్నికల్లో ఓటమి చెందినంత మాత్రాన డీఎంకే పని అయిపోయిందని కొందరు ప్రత్యర్థులు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారన్నారు. 1949లో ప్రారంభమైన డీఎంకే ఎన్నో విజయాలు, అపజయాలను చూసిందని, ఓడిపోయిన ప్రతిసారీ డీఎంకే ఫీనిక్స్ పక్షిలా పైకి లేచిందన్నారు..
ఇప్పటికీ ద్రవిడ మోడల్ పాలనే..
డీఎంకే 5 ఏళ్ల పాలనలో ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేసిందన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన పథకాలనే కొనసాగిస్తోందన్నారు. ఆ రకంగా చూస్తే తమిళనాడులో ఇప్పటికీ ద్రవిడ మోడల్ పాలనే నడుస్తోందన్నారు. డీఎంకే సాధనలను ఎవరూ మార్చలేరని వ్యాఖ్యలు చేశారు.
ఓటమిపై విశ్లేషణ
ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో పరిశీలించడానికి ఒక కమిటీని వేశామనాన్నారు. లోపాలను తెలుసుకోవడానికి ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించామన్నారు. ఇందులో ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పవచ్చు అని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలవకుండా, కనీసం బూత్ ఏజెంట్లను కూడా సరిగ్గా నియమించకుండా కేవలం సోషల్ మీడియా ద్వారా కొందరు విజయం సాధించారని వివరించారు. ఇకపై మనం కూడా అలర్ట్‌గా ఉండి సోషల్ మీడియా వ్యూహాలతో వారిని తిప్పికొడతామన్నారు. డీఎంకే మరో ఐదేళ్లు అధికారంలో ఉండి ఉంటే మరిన్ని మంచి పనులు చేసేవాళ్లం అనే బాధ మాత్రమే ఉందన్నారు. అయినా సరే, ప్రజల తరఫున ఒక బలమైన ప్రతిపక్షంగా డీఎంకే అద్భుతంగా పనిచేస్తుందన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, రాబోయే రోజుల్లో మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.


