వేలూరు: అసెంబ్లీలో టీవీకే పార్టీకి మద్దతు తెలిపిన అన్నాడీఎంకే జోలార్‌పేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేసీ వీరమణి ఎడపాడి పయణిస్వామికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిన విషయం తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే పార్టీలోని సీవీ షణ్ముగం, వేలుమణి తో పాటు తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట నియోజక వర్గానికి చెందిన మాజీ మంత్రి కేసీ వీరమణి కూడా ఉన్నారు. అయితే అసెంబ్లీలో టీవీకేకు మద్దతుగా ఓట్లు వేశారనే నేపథ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శులను మార్పు చేశారు. ఈ జాబితాలో తిరుపత్తూరు జిల్లా కార్యదర్శిగా ఉన్న కేసీ వీరమణిని మార్పు చేస్తూ ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే పశుపతిని జిల్లా కార్యదర్శిగా నియమించారు. చైన్నె నుంచి సొంత నియోజక వర్గానికి వచ్చిన ఆయన జోలార్‌పేటలోని కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా తాను అన్నాడీఎంకే పార్టీలో ఉన్నానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే మూడవ స్థానానికి చేరుకోవడంతో పాటు వంద స్థానాలకు పైగా డిపాజిట్ కోల్పోయిందన్నారు. దీంతోనే ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఏమీ చేయలేమని టీవీకేతో కూటమి చేరి ప్రజలకు మంచి చేయాలనుకుని టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చామన్నారు. దీంతోనే తమను పార్టీ నుంచి తొలగించారన్నారు. తాను అన్నాడీఎంకేలోనే ఉంటానని, ఎడపాడి పళనిస్వామితోనే ప్రయాణం చేస్తాననని తనకు అన్నాడీఎంకే పార్టీ, కార్యకర్తలు ముఖ్యమన్నారు. ఎడపాడితోనే తాను కలిసి ప్రయాణం చేయనున్నట్లు ప్రకటించారు.
టిప్పర్ కింద పడి
ఆన్‌లైన్ డెలివరీ బాయ్ మృతి
తిరువొత్తియూరు: చైన్నె, కోయంబేడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ లారీ కింద పడి ఆన్‌లైన్ డెలివరీ ఉద్యోగి మృతి చెందారు. కరూర్ జిల్లా, కోయంపల్లి ప్రాంతానికి చెందిన తరుణ్‌కుమార్ (28), చైన్నె కొలత్తూరులో తన స్నేహితుడితో కలిసి ఉంటూ ఆన్‌లైన్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో, తరుణ్‌కుమార్ కోయంబేడు మార్కెట్ సమీపంలోని రోడ్డుపై తన మోటార్ సైకిల్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో మార్కెట్ ప్రాంగణంలో చెత్తను సేకరించే ఒక ‘టిప్పర్ లారీ‘ వేగంగా వచ్చి తరుణ్‌కుమార్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నియంత్రణ కోల్పోయి కింద పడిపోయిన తరుణ్‌కుమార్, లారీ వెనుక చక్రాల కింద చిక్కుకున్నాడు. తల నలిగిపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న కోయంబేడు ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, మయిలాడుతురైకి చెందిన రాజీ (26)ని అరెస్ట్ చేశారు.


