ప్రభుత్వ వైద్యశాలలో సేవ చేస్తా | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యశాలలో సేవ చేస్తా

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

తిరువళ్లూరు: ప్రభుత్వ వైద్యశాల పనితీరును తెలుసుకోవడానికి ప్రభుత్వ వైద్యశాలను ప్రతి నెలా సందర్శించడంతోపాటు రోగులకు 24 గంటలపాటు సేవ చేస్తానని తిరువళ్లూరు ఎమ్మెల్యే డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. తిరువళ్లూరు ఎమ్మెల్యేగా టీవీకే తరఫున పోటీ చేసిన డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ విజయం సాధించారు. అనంతరం పదవి ప్రమాణస్వీకారం చేసిన తరువాత నియోజకవర్గానికి వచ్చిన డాక్టర్‌ అరుణ్‌కుమార్‌, కలెక్టర్‌ ప్రతాప్‌ను కలిసి నియోజకవర్గంలోని సమస్యలు, పెండింగ్‌ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాగుతున్న పనులను వేగంగా పూర్తిచేయడంతో పాటు ఆలస్యం చేయకుండా అందుబాటులోకి తేవాలని సూచించారు. అనంతరం తిరువళ్లూరు మెడికల్‌ కళాశాల, వైద్యశాలను పరిశీలించి రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం, మందుల స్టాక్‌, డాక్టర్‌లు, నర్సుల హాజరుపట్టిక పరిశీలించి వివరాలను డీన్‌ ద్వారా డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరువళ్లూరుకు వచ్చే రోగులను చైన్నె ప్రాంతాల్లోని వైద్యశాలలకు రెఫర్‌ చేయకుండా అన్ని రకాల వైద్యసేవలను తిరువళ్లూరులో అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. దీంతోపాటు కార్డియాలజీ, ఏంజియోగ్రామ్‌, న్యూరోసర్జరీ విభాగాల పనితీరును సైతం మెరుగుపరచడానికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. ఏఆర్‌ఎంఓ డాక్టర్‌ ప్రభుశంకర్‌, డాక్టర్‌ జగదీష్‌, డాక్టర్‌ విజయరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement