సాక్షి, చైన్నె: అంతరిక్ష రంగంలో సరిహద్దులను చెరిపేస్తూ, సరికొత్త అంతర్జాతీయ దౌత్యానికి ’స్పేస్ కిడ్జ్ ఇండియా’ శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా బాలికల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న చరిత్రాత్మక చంద్రుడి శాటిలైట్ ప్రాజెక్ట్ ‘మిషన్ శక్తిశాట్‘ను తాజాగా శ్రీలంకకు కూడా విస్తరించింది. ఉమెన్ ఇన్ మేనేజ్‌మెంట్ గ్లోబల్ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా ఈ మిషన్‌లో మరో కీలక మైలురాయి నమోదైంది. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యానికి సంబంధించి స్పేస్ కిడ్జ్ ఇండియా వ్యవస్థాపకురాలు, సీఈఓ డాక్టర్ శ్రీమతి కేసన్, శ్రీలంక డిజిటల్ ఎకానమీ గౌరవ డిప్యూటీ మంత్రి ఎరంగ వీరరత్నేతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అంతరిక్ష శాస్త్రం, స్టెమ్ విద్య, ఆవిష్కరణలు, బాలికల సాంకేతికత సాధికారతపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. ఈసందర్భంగా శ్రీమతి కేసన్ మాట్లాడుతూ, 108 దేశాలకు చెందిన సుమారు 12,000 మంది బాలికలు కలిసి ఒక చంద్రుడి ఉపగ్రహాన్ని డిజైన్, కోడింగ్, లాంచ్ చేయనున్నారని తెలిపారు. యువతులకు శాటిలైట్ టెక్నాలజీ, పీసీబీ డిజైనింగ్, కోడింగ్, సిస్టమ్స్ ఇంజినీరింగ్ వంటి అంశాల్లో ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 7,800 మందికి పైగా విద్యార్థినులు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములయ్యారని, ఈ వినూత్న ప్రయత్నాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఇటీవలే ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు.


