తిరుప్పత్తూర్‌ టీవీకే ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

తిరుప్పత్తూర్‌ టీవీకే ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్‌

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

● విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా నిషేధం

సాక్షి, చైన్నె: శివగంగ జిల్లా తిరుప్పత్తూర్‌ నియోజకవర్గం నుండి కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాస్‌ హైకోర్టు కీలక ఆంక్షలు విధించింది. అసెంబ్లీలో జరిగే విశ్వాస తీర్మానంతో పాటు ఇతర కీలక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆయనకు నిషేధం విధించింది. ఈ నియోజకవర్గంలో స్వల్ప తేడా ఒక్క ఓటుతో ఓడిపోయిన డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి కె.ఆర్‌. పెరియకరుప్పన్‌ హైకోర్టును కోర్టును ఆశ్రయించారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటును అధికారులు పొరపాటున వేలూరు సమీపంలోని తిరుప్పత్తూరు నియోజకవర్గానికి పంపారని, దీనివల్ల ఫలితం మారిపోయిందని పెరియకరుప్పన్‌ కోర్టులో వాదించారు. సక్రమంగా రీ–కౌంటింగ్‌ జరగలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్‌ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. పోస్టల్‌ ఓటు నియోజక వర్గం మారిందనే వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత పోస్టల్‌ ఓట్లను తిరిగి వెనక్కి తెప్పించి రీ–కౌంటింగ్‌ చేసే అధికారం అధికారులకు ఉండదని తెలిపారు. కేవలం ఎన్నికల పిటిషన్‌ ద్వారానే దీనిపై విచారణ జరగాలని, రిట్‌ పిటిషన్‌ ద్వారా కాదని వాదించారు.

హైకోర్టు ఆదేశాలు..

మంగళవారం జస్టిస్‌ ఎల్‌. విక్టోరియా గౌరీ, జస్టిస్‌ ఎన్‌. సెంథిల్‌ కుమార్‌ ధర్మాసనం ఈ కేసును విచారించి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి అసెంబ్లీలో జరిగే విశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని ఆదేశించారు. సదరు నియోజకవర్గానికి చెందిన పోస్టల్‌ ఓట్లు, ఈవీఎం ఓట్ల వివరాలు, కౌంటింగ్‌ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ పరిణామాలతో బుధవారం జరిగే సీఎం విజయ్‌ బల నిరూపణలో పాల్గొనే అవకాశం శ్రీనివాస సేతుపతికి లేకుండా పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement