సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సాధించిన అద్భుత విజయం ఢిల్లీలోని రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, విజయ్ ఎదుగుదలను మొదటి నుంచీ గమనిస్తూ ఉండటం, ఇప్పుడు ఏకంగా మద్దతు ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అదే సమయంలో రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, తాజాగా ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నిర్ణయం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
ఆది నుంచి డీఎంకేపై అసంతృప్తి
తమిళనాడులో 1967 తర్వాత కాంగ్రెస్ ఎన్నడూ అధికారంలో వాటాను అనుభవించలేదు. మంత్రి పదవులూ దక్కలేదు. అత్యధిక కాలం డీఎంకే వెనుక నడవడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ తన సొంత బలాన్ని పెంచుకోలేకపోయిందని, విజయ్‌తో చేతులు కలిపి ఉంటే మరిన్ని స్థానాలు గెలిచి అధికారంలో భాగస్వామ్యం పొంది ఉండేవారమని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం. విజయ్ తన ప్రసంగాల్లో తరచుగా కర్మయోగి కామరాజర్ పాలనను తిరిగి తెస్తామని చెప్పడం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆకట్టుకుంది. అందుకే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ టీవీకేకు తక్షణం మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు
అధికార కేంద్రంగా విజయ్
కాంగ్రెస్ మద్దతుతో విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. ఇది కేవలం ఒక కూటమి మార్పు మాత్రమే కాదు, దశాబ్దాల ద్రావిడ రాజకీయాల్లో ఒక కొత్త పంథాకు నాంది పలికినట్లయ్యింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో (2029) విజయ్ – కాంగ్రెస్ కూటమి తమిళనాడులో ప్రధాన శక్తిగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అసలు ఆట ఇప్పుడే మొదలైంది
తాజాగా విజయ్ వేసిన తాజా మాస్టర్ ప్లాన్ డీఎంకేను ఇరకాటంలో పడేసింది. అటు రాహుల్ గాంధీ కూడా విజయ్‌కు అమితమైన ప్రాధాన్యత ఇస్తుండటంతో, రాబోయే రోజుల్లో తమిళనాడు అధికార కేంద్రం ఎటువైపు మరలుతుందో చూడటం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయ్యేందుకు విజయ్ త్వరలోనే ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఆతుపరి సరికొత్తగా విజయ్ – రాహుల్ కాంబోలో కొత్త రాజకీయం తమిళనాట మొదలు కాబోతున్నట్టు చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం కొత్త బంధం గురించి కాంగ్రెస్ వాదులు పేర్కొంటూ, డీఎంకే కూటమిలో ఉన్నప్పుడు తమకు సరైన గౌరవం దక్కలేదని పేర్కొంటున్నారు. కొత్త వారైన టీవీకే నేతలు తమకు సముచిత స్థానం ఇస్తారని, రాబోయే స్థానిక ఎన్నికలలో ఎక్కువ సీట్లు సాధించి పార్టీని స్థానికంగా తాము బలోపేతం చేసుకునేందుకు సైతం వీలుంటుందన్నారు. ఇది తాజా బంధానికి మరింత బలాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యనిస్తున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకే విజయ్‌తో జత కట్టాలన్న వ్యూహానికి సైతం చెక్ పెట్టినట్టుగా పేర్కొనడం గమనార్హం.


