మే డే స్థూపం వద్ద సీఎం స్టాలిన్ వీరవందనం
సాక్షి, చైన్నె : వాడవాడల్లో శుక్రవారం కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజకీయ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల నేతృత్వంలో పేద కార్మికులకు సంక్షేమ పథకాల పంపిణీ చేశారు. చైన్నెలోని మేడే పార్క్‌కు నేతలు తరలి వచ్చారు. ఇక్కడి మేడే స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి వీర వందనం సమర్పించారు. రాష్ట్రంలోని కార్మిక లోకం వాడ వాడల్లో తమ మే డేను శుక్రవారం జరుపుకున్నాయి. కర్షక చిహ్నాలతో కూడిన జెండాలను ఎగుర వేశారు. అధికార డీఎంకే , ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేతోపాటు కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల నేతృత్వంలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. ర్యాలీలు, జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. పేద కార్మికులకు సంక్షేమ పథకాల పంపిణీ చేశారు. తమిళ మానిల కాంగ్రెస్ నేతృత్వంలో మేడే కార్యక్రమం కార్మికుల సంక్షేమ సహాయ దినోత్సవంగా నిర్వహించారు. కోయంబేడులోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా విజయకాంత్ జెండా ఎగుర వేసి, కార్మికులకు సహాయకాలను అందజేశారు. సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీనాయకులు వీర పాండియన్, ముత్తరసన్ జెండా ఎగుర వేశారు. ిసీపీఎం కార్యాలయంలో నేతలు షన్ముగం, బాలకృష్ణన్, ఎండీఎంకే కార్యాలయంలో నేతలు వైగో, కార్మిక జెండాలను ఆవిష్కరించారు. చింతాద్రి పేటలోని మేడే పార్క్‌లో ఉన్న స్మారక స్థూపానికి వీర వందనం సమర్పించేందుకు పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగైతో పాటుగా నేతలు తరలివచ్చి వీరవందనం సమర్పించారు. వీసీకే తరఫున పలువురు నేతలు తరలి వచ్చి వీర వందనం సమర్పించారు. అన్నాడీఎంకే కార్మాక విభాగం నేతృత్వంలోని నాయకులు సైతం తరలి వచ్చారు. సీఎం ఎంకే స్టాలిన్ తాను కార్మికుడ్ని అని చాటుకునే విధంగా ఎరుపు రంగం చొక్కా ధరించి వచ్చారు. మంత్రులు నెహ్రూ, శేఖర్‌బాబు, ఎంపీ రాజా , మేయర్ ప్రియ పాల్గొన్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు. నిరంతరం కార్మికులు దోపిడికి గురి అవుతున్నారని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.


