ప్రైమ్ డే–2026కు
సన్నద్ధం
సాక్షి, చైన్నె: ప్రతిష్టాత్మక ప్రైమ్‌డే–2026 వేడుక విక్రయాలను ఈ ఏడాది జూలై నెలలో నిర్వహించనున్నట్టు అమెజాన్ శుక్రవారం స్థానికంగా ప్రకటించింది. ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ఈ అతిపెద్ద షాపింగ్ పండుగ 10వ ఎడిషన్ కావడం విశేషంగా పేర్కొన్నారు. ఇందులో ప్రైమ్ సభ్యులు అద్భుతమైన ఆఫర్లు, భారీ తగ్గింపులు, కొత్త ఉత్పత్తుల లాంచ్‌లు, వినోదాన్ని ఆస్వాదించవచ్చని కంపెనీ తెలిపింది. ఈసందర్భంగా ప్రైమ్‌డే–2026 సందడి వివరాలను ప్రకటించారు.
సవాళ్లు ఎదురైనా
సానుకూల వృద్ధి
సాక్షి, చైన్నె: అంతర్జాతీయంగా నెలకొన్న పశ్చిమాసియా సంక్షోభం వలన అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఏప్రిల్ 2026 నెలలో సానుకూల వృద్ధిని సాధించినట్టు , జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. 2025, ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈసారి కంపెనీ 3 శాతం కంటే ఎక్కువ వార్షిక వృద్ధిని నమోదు చేసినట్టు ఆ సంస్థ ప్రతినిధి వివరించారు. పశ్చిమాసి యా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ సరఫరా దెబ్బతినడం, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడడం వలన ఆటోమొబైల్ మార్కెట్లో డిమాండ్ తగ్గినప్పటికీ, కంపెనీ ఈ ఘనత సాధించడం విశేషంగా పేర్కొన్నారు.
చెరువులో మునిగి
తాతామనవడు మృతి
తిరువొత్తియూరు: చైన్నె, పల్లికరనై సమీపంలో శుక్రవారం ఉదయం చెరువు లో స్నానం చేస్తున్న సమయంలో నీట మునిగి తాత,మనుమడు మృతి చెందారు. చైన్నె, పల్లికరణై సమీపంలోని నారాయణపురం, సెంగణి అమ్మన్ కోవెల వీధికి చెందిన వారు పెరుమాళ్ (60) ఇతను శుక్రవారం ఉదయం తన మనవళ్లు భరత్ (15), దినేష్ (14) లతో కలిసి స్నా నం చేయడానికి నారాయణపురం చెరువుకు వెళ్లారు.చెరువులో స్నానం చేస్తున్న సమయంలో, పెరుమాళ్ మనవడు భరత్ అనుకోకుండా లోతైన ప్రాంతానికి వెళ్లి బురదలో చిక్కుకున్నాడు. నీటిలో మునిగిపోతున్న మనవడిని చూసిన పెరుమాళ్, అతడిని కాపాడటానికి ప్రయత్నించారు. అయితే, ఆ ప్రయత్నంలో ఆయన కూడా బురదలో చిక్కుకుని నీటిలో మునిగిపోయారు.గట్టు మీద ఉన్న మరో మనవడు దినేష్ ఇది చూసి గట్టిగా కేకలు వేయడంతో, చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. వారు పెరుమాళ్‌ను బయటకు తీశారు, కానీ అప్పటికే ఆయన మరణించారు. బురదలో చిక్కుకున్న భరత్ మృతదేహాన్ని వెలికితీసేందుకు మేడవక్కం అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
తనిష్క్ డైమండ్ సెంటర్ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని పశ్చిమ తాంబరంలో తనిష్క్ సరికొత్త డైమం్ సెంటర్‌గా విక్రయ కేంద్రాన్ని ప్రారంభించింది. టాటా గ్రూప్‌నకు చెందిన భారతదేశపు అతిపెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ తనిష్క్ తమిళనాడులో తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా సరికొత్త విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఆసంస్థ సీఈఓ అరుణ్ నారాయణ్, తమిళనాడు – కేరళ జ్యువెలరీ విభాగం బిజినెస్ హెడ్ నరసింహన్ వై.ఎల్ వివరించారు. తమిళనాడులో తనిష్క్ స్టోర్ల సంఖ్య దీంతో 66కు చేరగా, చైన్నె నగరంలోనే ఇది 24వ స్టోర్‌గా సరికొత్త మైలురాయిని అధిగమించిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తనిష్క్ ప్రతినిధులు, విశేష సంఖ్యలో వచ్చిన కస్టమర్లు పాల్గొన్నారు. తనిష్క్ తన కస్టమర్ల కోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించారు. ప్రత్యేక కలెక్షన్లు , ఆకర్షణలతో అద్భుతమైన జ్యువెలరీ డిజైన్లు కొలువుదీర్చారు. తనిష్క్ డైమండ్ ఎక్స్‌పరైజ్ సెంటర్‌గా ఈ నూతన విక్రయ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదు రకాల అత్యాధునిక పరికరాల ద్వారా వజ్రాల నాణ్యత, కాంతివంతమైన మెరుపు మరియు వాటిపై ఉండే లేజర్ మార్కింగ్‌లను కస్టమర్లు నేరుగా పరీక్షించుకోవచ్చు అనిఅరుణ్ నారాయణ్ సూచించారు.
ప్రత్యేక బస్సుల్లో రద్దీ
కొరుక్కుపేట: మే డే, చిత్ర పౌర్ణమి సందర్భంగా, తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థల తరఫున చైన్నె నుండి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. వరుసగా మూడు రోజుల సెలవు కారణంగా పట్టణం వెలుపల ప్రయాణాలు పెరిగే అవకాశం ఉన్నందున, కీలంబాక్కం, కోయంబేడు, మాధవరం బస్ స్టేషన్ల నుండి ఈ ప్రత్యేక బస్సులను నడిపారు. గురువారం నుండి శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల వరకు, 2,092 సాధారణ బస్సులు, 1,784 ప్రత్యేక బస్సులతో సహా మొత్తం 3,876 బస్సులు నడపబడ్డాయి. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా ఒక్క రోజులోనే 2 లక్షల 13 వేల 180 మంది ప్రయాణికులు ప్రయాణించారు. అంతేకాకుండా, ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడపడానికి రవాణా సంస్థ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇది కాకుండా, ప్రైవేట్ ఓమ్ని బస్సులలో 50 వేల మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించారు.


