సాక్షి, చైన్నె: అళగర్ స్వామి వైగై నది ప్రవేశం దర్శనాన్ని వీక్షించేందుకు బైక్‌లో బయలు దేరిన యువకులు ప్రమాదం బారిన పడి మృతిచెందారు. రెండు మోటారు సైకిళ్లు ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. దిండిగల్ జిల్లా నత్తం ప్రాంతానికి చెందిన సల్మాన్ ఖాన్ (21), విశ్వ (21), విగ్నేష్ (22) ముగ్గురు స్నేహితులు. మదురైలో శుక్రవారం జరిగిన కల్లాళగర్ వైగై నది ప్రవేశం ఉత్సవాన్ని చూడడానికి నిర్ణయించారు. దీంతో గురువారం రాత్రి ఒకే బైక్‌పై నత్తం నుంచి మదురైకి ముగ్గురు బయలుదేరారు. అర్ధరాత్రి వీరు నత్తం ఫ్లైఓవర్‌పై వెళుతుండగా మదురైలోని ఒత్తక్కడై ప్రాంతానికి చెందిన మాదేశ్ (27) అనే యువకుడు తన బైక్‌లో అదే ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్‌లో ఎదురుగా వచ్చి సల్మాన్ ఖాన్ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు బైక్‌లపై ఉన్న నలుగురు యువకులు రోడ్డుపై తీవ్ర గాయాలతో పడిపోయారు. సమాచారం అందుకున్న తల్లాకుళం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మదురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సల్మాన్‌ఖాన్, విశ్వ, మాదేశ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందారు. విగ్నేష్ తీవ్ర గాయలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లాకుళం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


