క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

లైంగిక దాడి కేసులో

నిందితుడికి జైలు శిక్ష

తిరువళ్లూరు: పదకొండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 27 సంవత్సరాల జైలుశిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు ప్రాంతానికి చెందిన పదకొండేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన వెంకటేషన్‌ కుమారుడు ప్రేమ్‌కుమార్‌ గత 2024లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన క్రమంలో కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో సాగింది. విచారణలో నిందితుడు నే రం చేసినట్టు రుజువు కావడంతో 27 సంవత్సరాల శిక్షతో పాటు పది వేల రూపాయల జరి మానా విధిస్తూ న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. అనంతరం నిందితుడిని పుళల్‌ జైలుకు తరలించారు.

సైబర్‌ క్రైమ్‌లో 12 మంది అరెస్ట్‌

తిరువొత్తియూరు: సైబర్‌ క్రైమ్‌ ద్వారా మోసం చేసి సంపాదించిన డబ్బును విదేశాలకు పంపినందుకు రామనాథపురం, శివగంగ, విరుదునగర్‌ జిల్లాలకు చెందిన 12 మందిని చైన్నె సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సైబర్‌ క్రైమ్‌ విభాగానికి చెందిన ప్రధాన కార్యాలయం నిర్వహించిన సుదీర్ఘ నిఘా, విచారణలో పలు రహస్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌ పెట్టుబడి మోసాలు, సైబర్‌ నేరాల ద్వారా అమాయక ప్రజల నుండి దోచుకున్న డబ్బును విదేశీ సైబర్‌ క్రైమ్‌ ముఠాలకు పంపే ఒక నెట్‌వర్క్‌ పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి గత మార్చి నెలలో రామనాథపురం జిల్లాకు చెందిన ఏడుగురు నిందితులను ప్రత్యేక బృందం ఇప్పటికే అరెస్టు చేసింది. పోలీసుల తదుపరి విచారణలో ఈ ముఠా 2025–2026 సంవత్సరాల్లో రూ.100 కోట్ల విలువైన సైబర్‌ నేరాల ఆదాయాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చి అంతర్జాతీయ సైబర్‌ నేరగాళ్ల ఆధీనంలో ఉన్న వాలెట్‌లకు బదిలీ చేసినట్లు తెలిసింది. దీనిని అనుసరించి చైన్నె నుండి వచ్చిన ప్రత్యేక బృందం రామనాథపురం జిల్లా దేవిపట్నం, పరమకుడి, సక్కరకోట్టై, శివగంగ, విరుదునగర్‌ ప్రాంతాలలో దాడులు చేసి 12 మందిని అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. వీరందరినీ తదుపరి విచారణ నిమిత్తం చైన్నెకి తరలించారు.

విదేశీ సిగరెట్లు స్వాధీనం

అన్నానగర్‌: చైన్నెలోని పెరియమేడు ప్రాంతంలోని ఒక భవనంలో విదేశీ సిగరెట్లను అమ్మకం కోసం నిల్వ ఉంచుతున్నారని కస్టమ్స్‌ అధికారులకు రహస్య సమాచారం అందింది. దీని తరువాత కస్టమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇలవరసన్‌ నేతృత్వంలోని అధికారులు శుక్రవారం ఉదయం సదరు భవనానికి వెళ్లి విచారణ జరిపారు. అక్కడ ఒక ట్రావెల్‌ కంపెనీ పేరుతో నడుస్తున్న కార్యాలయం తాళం వేసి ఉండటాన్ని వారు గమనించారు. కార్యాలయం తాళం పగలగొట్టి లోపల సోదా చేసిన, అధికారులు రూ.8 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. భవన యజమానిని ప్రశ్నించగా తాను ఆ కార్యాలయాన్ని ఒకరికి అద్దెకు ఇచ్చానని, 6 నెలల పాటు దానికి తాళం వేసి ఉందని అతను చెప్పాడు. దీంతో ఆ కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. పెరియమేడు పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట మోసం

తిరువళ్లూరు: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట బాధితుడి నుంచి 59 లక్షల రూపాయలను వసూలు చేసి ఉడాయించిన ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌తో పాటు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా తిరువేర్కాడు ప్రాంతానికి చెందిన శంకర్‌ కుమారుడు కార్తీకేయన్‌(38)కు వాట్సాప్‌ ద్వారా ఇద్దరు యువకులు సంప్రదించి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే మూడింతలు లాభం వస్తుందని నమ్మించారు. అతడి నుంచి సుమారు 59 లక్షల రూపాయలను వసూలు చేశారు. అనంతరం లాభం ఇవ్వకపోగా, ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని బాధితుడు పదేపదే కోరినా ఫలితం లేకపోయింది. దీంతో ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో మోసం చేసిన వ్యక్తులు తిరువణ్ణామలై ప్రాంతానికి చెందిన మహేంద్రకోటక్‌ బ్యాంకు మేనేజర్‌ మోనీష్‌రాజ్‌(26), తిరువళ్లూరుకు చెందిన విజయ్‌కార్తీక్‌(29)గా గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

జూన్‌ వరకు తూత్తుకుడి–

తాంబరం రైలు

తిరువొత్తియూరు: తూత్తుకుడి–తాంబరం మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను జూన్‌ నెల వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపారు తూత్తుకుడి–తాంబరం స్పెషల్‌ (రైలు నం.06018) రైలు మే 4, 11, 18, 25, జూన్‌ 1, 8 తేదీలలో (సోమవారాలు) నడుస్తుంది. ఈ రైలు తూత్తుకుడి నుంచి రాత్రి 11.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది. అలాగే తాంబరం–తూత్తుకుడి స్పెషల్‌ (రైలు నం 06017) రైలు మే 5, 12, 19, 26, జూన్‌ 2, 9 తేదీలలో మంగళవారాలు నడుస్తుంది. ఇది తాంబరం నుంచి సాయంత్రం 3.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు తూత్తుకుడి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు మేలూరు, కోవిల్‌పట్టి, సాత్తూరు, విరుదునగర్‌, మధురై, దిండిగల్‌, తిరుచిరాపల్లి, తంజావూరు, కుంభకోణం, మయిలాడుదురై, చిదంబరం, విల్లుపురం, చెంగల్పట్టు వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. ఈ సర్వీసును పొడిగించినందుకు తూత్తుకుడి జిల్లా ప్రయాణికుల సంక్షేమ సంఘం దక్షిణ రైల్వేకు కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement