నీలగిరుల్లో వాన | - | Sakshi
Sakshi News home page

నీలగిరుల్లో వాన

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

● 8 జిల్లాలకు నేడు అలర్ట్‌ ● కెరటాల జడి

సాక్షి, చైన్నె : రామేశ్వరం, ధనుస్కోటి తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కెరాటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దీంతో పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకుండా పోలీసులు నిషేధం విధించారు. రామేశ్వరం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ధనుస్కోటి , అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అరిచల్‌మునై అనే ప్రాంతాలు ఉన్నాయి. ధనుస్కోటిని చూడడానికి పర్యాటకులు, అరిచల్‌ మునై వద్ద పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వేలాదిగా వస్తుంటారు. గత రెండు రోజులుగా ఈ పరిసరాలలో స్వల్పంగా కెరటాలు ఎగసి పడుతూ వచ్చాయి. శుక్రవారం ఇది మరింత ఎక్కువైంది. ధనుస్కోటిలోని దక్షిణ మన్నార్‌ గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ సముద్ర ప్రాంతం తీవ్ర అల్లకల్లోలంగా మారింది.

సముద్రపు అలల ధాటికి ధనుస్కోటి– అరిచల్‌ మునై జాతీయ రహదారి కోతకు గురికాకుండా ఏర్పాటు చేసిన రక్షణ కంచె రాళ్లు రోడ్డుపైకి కొట్టుకొచ్చాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతోపాటు బలమైన గాలులు వీస్తుండడంతో ధనుష్కోటి, ముకుందరాయర్‌ సత్రం, అరిచల్‌ మునై ప్రాంతాల్లో భక్తులు, పర్యాటకులు సముద్రంలో దిగి స్నానం చేయడాన్ని పోలీసులు పూర్తిగా నిషేధించారు.

అకాల వర్షం

కోయంబత్తూరు, నీలగిరి సహా 8 జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఒడిశా నుంచి మన్నార్‌ గల్ఫ్‌ వరకు, తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ప్రకటించారు. దీని ప్రభావంతో శనివారం నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్‌, తేని, దిండిగల్‌, ఈరోడ్‌, సేలం, నామక్కల్‌ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచి, పిడుగులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించారు. అలాగే, 3వ తేదీన, నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్‌ జిల్లాల్లోని కొండ ప్రాంతాలు, తేని, దిండిగల్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, 4వ తేదీన నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లోని కొండ ప్రాంతాలు, ఈరోడ్‌, సేలం, నామక్కల్‌, తిరుచ్చి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. అదే సమయంలో శుక్రవారం నీలగిరుల్లో అనేక చోట్ల వర్షం పడింది. తిరునెల్వేలి జిల్లా నాలుముక్కు, కాక్కాచ్చిలలో అత్యధికంగా 7 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. దిండిగల్‌ జిల్లా పళనిలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. తిరునెల్వేలి జిల్లా మాంజోలై, అంబసముద్రం, నీలగిరి జిల్లా వుడ్‌ బ్రయర్‌ ఎస్టేట్‌, చెరుముల్లి, ఈరోడ్‌ జిల్లా మొడక్కురిచ్చి ప్రాంతాల్లో 4 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. కోయంబత్తూరులోనే అనేక చోట్ల అకాల వర్షం పడగా, రోడ్డుపై నీరు చేరడంతో యుద్ధప్రాతిపదికన తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement