సాక్షి, చైన్నె: దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం నుంచి వర్తించేలా గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడంతో తమిళనాడులో వర్తకులలో ఆందోళన నెలకొంది. ఇక దుకాణాలను మూసి వేయడం లేదా అన్ని రకాల ఆహార పదార్థాలపై ధరలను పెంచడం తప్ప మరే గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరల హెచ్చుతగ్గులతో సాగుతుంది. గత కొంత కాలంగా వాణిజ్య సిలిండర్లు తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే అనేక దుకాణాలు వారంలో రెండుమూడు రోజులు తాళం వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో వర్తక సిలిండర్లపై భారం మోపడం చర్చకు దారి తీసింది. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ.993 నుండి రూ.1,147 వరకు (నగరాల వారీగా) పెంచారు. చైన్నెలో గతంలో రూ.2,246.50 ఉండగా, ఇప్పుడు రూ.1,013 పెరిగి రూ.3,259.50 కు సిలిండర్ ధర చేరింది. ఇదే పరిస్థితి కాస్త హెచ్చుతగ్గులతో రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాలలో వర్తక సిలిండర్ల ధర నమోదైంది. దీంతో వర్తకులు, హోటల్ యజమానులు, టీ దుకాణదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధరను అమాంతంగా పెంచేయడం బట్టి చూస్తే, ఇక దుకాణాలకు తాళం వేసుకోవడం లేదా, తమ మీద పడ్డ భారం నుంచి బయట పడేందుకు ధరల పెంపు అనివార్యంగా పేర్కొంటున్నారు. టీ, కాఫీ, హోటళ్లలో అన్ని రకాల ధరలు శనివారం నుంచి అమాంతంగా పెంచక తప్పదని వర్తక సంఘాలు ప్రకటించడం గమనార్హం. తాజాగా పెంపుతో ప్రజల మీద మరింత భారం పడ్డట్టు అయింది. ఈ పెంపును సీఎం స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. ప్రజల నడ్డి విరిచేందుకు కేంద్రంలోని పాలకులు సిద్ధమయ్యారని మండి పడ్డారు. ఈ పెంపును వెనక్కు తీసుకోవాలని డిమండ్ చేశారు. తాజాగా వర్తక సిలిండర్ల ధర పెంచిన కేంద్రం, మున్ముందు ఇళ్లకు ఉపయోగించే ఎల్‌పీజీతో పాటుగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతంగా పెంచే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది.


