కీ సెగ్మెంట్
ప్రజల ప్రధాన డిమాండ్లు
● మూడేళ్లుగా సాగుతున్న కోట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయడం.
● పుత్తూరు, వయలూర్ రోడ్లలో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టడం.
● అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి కాలువల పనులను పూర్తి చేయడం.
సాక్షి, చైన్నె : తమిళనాడులోని అత్యంత కీలకంగా ఉన్న నియోజకవర్గాలలో తిరుచ్చి వెస్ట్ కూడా ఒకటి. ఇప్పుడు ఈ నియోజకవర్గం పై అందరి దృష్టి పడింది. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ మంత్రి కేఎన్ నెహ్రూ ఇక్కడి నుంచి హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఆయన్ని ఈసారి ఓడించడమే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నాయి.
రాజకీయ చరిత్ర
2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ముందుగా తిరుచ్చి –2 పేరిట ఉన్న ఈ నియోజకవర్గం ఆ తదుపరి ‘తిరుచ్చి వెస్ట్’గా పేరు మారింది. ‘తిరుచ్చి’ అన్న ఈ పేరు రాజకీయ వేదికలకు కేంద్ర బిందువుగా ఉంటోంది. తమిళనాడు మ్యాప్‌లో మధ్య భాగంలో ఉన్న ప్రదేశం. ఓ వైపు కొంగు మండలం, మరో వైపు దక్షిణ తమిళనాడు , ఇంకోవైపు డెల్టా, ఆ తదుపరి సముద్ర తీర, ఉత్తర తమిళనాడు జిల్లాలు నలుదిక్కులలో ఉన్నాయి. అందుకే తిరుచ్చిని మరో రాజధాని నగరంగా ప్రకటించాలని నినదించే వాళ్లు ఎక్కువే. ఆథ్యాత్మికంగా, రాజకీయంగా చరిత్రకెక్కిన తిరుచ్చి వెస్ట్‌లో (పూర్వంతో పాటుగా) ఇప్పటి వరకు 15 సాధారణ ఎన్నికలు, 2 ఉప ఎన్నికలు జరిగాయి. ఇక్కడి డీఎంకే 9 సార్లు, అన్నాడీఎంకే ఆరు సార్లు గెలిచాయి. సీపీఐ రెండు సార్లు పాగా వేసింది. ఇక్కడ గెలిచిన వారిలో ఐదుగురు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించి ఉండటం విశేషం.
అస్త్రాలు
మంత్రిగా నెహ్రూ తన నియోక వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటుగా పంచపూర్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్, టైడల్ పార్క్ వంటి భారీ ప్రాజెక్టులు కొత్త బలంగా మారింది. అదే సమయంలో ప్రజలలో ఉన్న అంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకతను తనకు ఆయుధంగా మలచుకునే విధంగా ఎం. రాజశేఖరన్ దూసుకెళ్తున్నారు. ఇటీవల క్యాష్ ఫర్ జాబ్స్ ఆరోపణలు నెహ్రూపై హోరెత్తుతుండటంతో ప్రజల్లోకి ఈ ప్రచారాన్ని విస్తృతంగా తీసుకెళ్తున్నారు.
నియోజకవర్గ ఓటర్ల వివరాలు
మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లదే పైచేయిగా ఇక్క డ ఉంది. పురుషులు: 1,13,050, మహిళలు: 1,22,817, ఇతరులు 36 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు: 2,35,903గా ఉన్నారు. 2021 ఎన్నికలలో నెహ్రూ 85,109 ఓట్ల భారీ మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి పద్మనాభన్‌ను ఓడించారు. అన్ని వర్గా ల ఓట్లతో నిండిన ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టి, తన కోటను సురక్షితం చేసుకునేందుకు ప్రతి పక్షాల ఆరోపణలు, విమర్శలను ఎదుర్కొనేందుకు కేఎన్ నెహ్రూ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు
తాజా అభ్యర్థులు వీరే
సిట్టింగ్ ఎమ్మెల్యేగా, రాష్ట్రం నగరాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేఎన్ నెహ్రూ ఇక్కడ డీఎంకే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 6వ సారి ఇక్కడ ఆయన పోటీలో ఉన్నారు. తొలుత లాల్గుడిలో, ఆ తదుపరి తిరుచ్చి –2లో గెలిచిన కేఎన్ నెహ్రు, తిరుచ్చి వెస్ట్‌లో ఆరో సారిగా బరిలో దిగారు. ఈ నియోజకవర్గం ఆవిర్భావంతో ఓటమి పాలైనప్పటికీ, 2016 లో పట్టు సాధించారు. 2021లో మళ్లీ విజయ ఢంకా మోగించారు. తాజాగా హ్యాట్రిక్ దిశగా ఉవ్విళ్లూరుతున్నారు. ఇక అన్నాడీఎంకే కూటమిలో ఈ సీటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు అప్పగించారు. ఎం. రాజశేఖరన్ అభ్యర్థిగా ఉన్నారు. స్థానికంగా బలం కలిగిన నేత కావడమే కాకుండా, కూటమి బలం కలిసి వస్తుండటంతో ఈ సారి సమరం హోరా హోరీగా ఉండే అవకాశాలు ఎక్కువే అంటున్నారు. ఇక టీవీకే తరపున జి రామమూర్తి, నామ్ తమిళర్ కట్చి తరపున మహిళా అభ్యర్థిగా భువనేశ్వరి పోటీలో ఉన్నారు.


