సాక్షి,చైన్నె : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం కై మాక్స్‌కు చేరింది. మంగళవారంతో ప్రచారానికి తెర పడనున్న నేపథ్యంలో సోమవారం కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌షా ఓ వైపు, ఏఐసీసీ నేత రాహుల్ గాంధి మరో వైపు పర్యటించేందుకు సిద్ధమయ్యారు. 30 స్థానాలతో కూడిన పుదుచ్చేరిలో ఇండియా కూటమి, ఎన్‌డీఏ కూటమి మధ్య ప్రధాన సమరం నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇండియా కూటమికిమద్దతుగా ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఉదయం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో చైన్నె చేరుకోనున్నారు.ఇక్కడి నుండి మినీ విమానంలో పుదుచ్చేరి వెళ్తారు. ఇక్కడ జరిగే రోడ్ షో, ప్రచార సభలలో రాహుల్ గాంధి పాల్గొననున్నారు. ఒకే వేదికపై అభ్యర్థులను పరిచయంచేయనున్నారు. అదే సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా పుదుచ్చేరిలో బీజేపీ,ఎన్.ఆర్. కాంగ్రెస్ కూటమి తరపున ప్రచారం నిర్వహించనున్నారు. ఇద్దరు అగ్ర నాయకులు ఒకే రోజు చైన్నె విమానాశ్రయం మీదుగా పుదుచ్చేరికి వెళ్తుండటంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఓ వైపు, డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో వైపు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే మరో వైపు పుదుచ్చేరిలో తిష్ట వేసే పనిలో పడ్డారు. ఇందుకు కారణం తమిళనాడు కన్నా ముందుగా పుదుచ్చేరిలో ఈనెల 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం సాయంత్రంతో ప్రచారం సమాప్తం కానున్నది. ఎన్నికలకు మూడు రోజులే సమయం ఉండటంతో బూత్ స్లిప్‌ల పంపిణి వేగవంతం చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై పుదుచ్చేరి ఎన్నికల యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది.ఇదిలా ఉండగా, తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికిమద్దతుగా పీఎం మోదీ నేతృత్వంలో కన్యాకుమారి, కోయంబత్తూరులలో ఎన్నికల ప్రచార సభకు ఏర్పాట్లు చేపట్టారు.


