సాక్షి, చైన్నె: శ్రీ రామచంద్ర ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని శ్రీవిద్యా సుధశ్రీ కేంద్రం నేతృత్వంలో ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లల కోసం థ్రైవ్ 2026 క్రీడోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. దివ్యాంగులైన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, వారి ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. తమిళనాడు ప్రభుత్వ దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. మధుమతి ఈ వేడుకలో మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు విద్యా సంస్థల్లో (పాఠశాలలు, కళాశాలలు) 5 శాతం రిజర్వేషన్ ఉందని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరికి 4 శాతం రిజర్వేషన్ కల్పించామని గుర్తుచేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. సినీ నటుడు సంతానం మాట్లాడుతూ గత 22 ఏళ్లుగా ప్రత్యేక పిల్లలకు ఉచిత విద్య, చికిత్స , శిక్షణ అందిస్తున్న శ్రీహెర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో శ్రీ రామచంద్ర ట్రస్ట్ చాన్స్‌లర్ వీఆర్.వెంకటాచలం సంయుక్త వెంకటాచలం, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఉమ విద్యావేత్తలు, వైద్యనిపుణులు పాల్గొన్నారు.


