పెరంబూరులో విజయ్
కారైక్కుడిలో సీమాన్ నామినేషన్ల దాఖలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. శుభ ముహూర్తం కావడంతో రాజకీయ దిగ్గజాలు తొలి రోజే తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చేశారు. ఇందులో సీఎం ఎంకే స్టాలిన్ కొళత్తూరులో, టీవీకే అధినేత విజయ్ పెరంబూరులో, కారైక్కుడిలో నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నామినేషన్లు సమర్పించారు.
సాక్షి, చైన్నె: రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగారా ఈ నెల రెండో వారంలో మోగిన విషయం తెలిసిందే. రాజకీయ పక్షాలు సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక, ప్రకటనలలో బిజీ అయ్యాయి. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకేలు తమ అభ్యర్థులను ప్రకటించారు. ఈ కూటములలోని కొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ పరిస్థితులలో ఎన్నికల నియమావళి అమల్లోకి తీసుకొస్తూ, నామినేషన్ల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణపై దృష్టి పెట్టారు. అభ్యర్థులకు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో పాటు కేవలం ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతించారు. అలాగే ఈసారి ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫొటోలు పొందుపరచనుండడంతో నామినేషన్ పత్రంతోపాటు అభ్యర్థులు నెల రోజుల్లోపు తీయించుకున్న 3 కొత్త రంగుల ఛాయాచిత్రాలను అభ్యర్థుల నుంచి సేకరించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ నెల 6వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నప్పటికీ, మంగళవారంతోపాటుగా మరో మూడు సెలవు దినాలు రావడంతో నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులకు అతి తక్కువ సమయమే ఉండడం గమానార్హం. ఏప్రిల్ 6 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 9న ఉపసంహరణ ప్రక్రియలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వం మొదలు కావడంతో నియోజకవర్గాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల కోడ్ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లు తనిఖీలో దూసుకెళ్తున్నాయి.
ముఖ్య నేతల నామినేషన్లు
తొలి రోజున ముఖ్య నేతలు అనేక మంది నామినేషన్లు దాఖలు చేశారు. చైన్నె కొళత్తూరు నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ నామినేషన్ సమర్పించారు. అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 స్థానాలలో గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కొళత్తూరులో ఈసారి తనకు భారీ విజయం ఖాయమని వ్యాఖ్యలు చేశారు. పెరంబూర్ నుంచి పోటీ చేస్తున్న టీవీకే అధినేత విజయ్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్.గీతకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఆనంద్, నిర్మల్ కుమార్ ఉన్నారు. తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో విజయ్ ఏప్రిల్ 2న నామినేషన్ దాఖలుకు నిర్ణయించారు. విల్లివాక్కం నియోజకవర్గం టీవీకే ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున సిడ్కో నగర్‌లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. టీవీకే వర్కింగ్ కమిటీ కన్వీనర్ సెంగోట్టయన్ గోబి చెట్టి పాళయంలో నామినేషన్ సమర్పించారు. ప్రప్రథమంగా ఎన్నికలలో పోటీ చేస్తున్న నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ కారైక్కుడిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉచితాలతో ప్రజల్ని మళ్లీ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీఎంకే మేనిఫెస్టోలోని అంశాలను గుర్తు చేస్తూ వారికి కావాల్సిన సంస్థలకు అనుకూలంగా వ్యవహరించేందుకే కూపన్ల నాటకమనిఆరోపించారు. అలాగే మంత్రులు ఎం.సుబ్రమణియన్‌తో పాటుగా మరి కొందరు, డీఎంకే అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనేక మంది నామినేషన్లు సమర్పించారు. ఇక సోషలిస్టు పార్టీ నాయకుడు, గాంధేయ వాది రమేష్ నామక్కల్‌లో సైకిల్‌పై వచ్చి నామినేషన్ సమర్పించారు. ఇదే తరహాలో పలువురు వినూత్న రీతిలో వచ్చి నామినేషన్లు సమర్పించారు. తొలి రోజున నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కొళత్తూరులో సీఎం స్టాలిన్
సిబ్బందికి శిక్షణ పూర్తి
రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో అధికారులు, పోలింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తయిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 3,32,231 మంది అధికారులకు ఎన్నికల విధులు, బాధ్యతలు, పారదర్శకతపై అవగాహన కల్పించామని వివరించారు. ఎన్నికల కమిషన్ విధుల్లో పాల్గొనే వివిధ కేటగిరీల అధికారులకు పారితోషికాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రిసైడింగ్ అధికారికి రూ.3 వేలు, పోలింగ్ అధికారికి రూ.2600, కౌంటింగ్ సూపర్‌వైజర్‌కు రూ.1500, అసిస్టెంట్‌కు రూ.1400, మైక్రో అబ్జర్వర్‌కు రూ.2 వేలు చొప్పున పారితోషికం నిర్ణయించారు. సోమవారం వరకు జరిగిన సోదాలలో రూ.296.40 కోట్ల విలువైన నగదు, వస్తువులు పట్టుబడ్డట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.


