న్యూస్‌రీల్
● 253వ సారిగా పద్మరాజన్ నామినేషన్ దాఖలు
సాక్షి, చైన్నె : ఎలక్షన్ కింగ్‌గా సుపరిచితులైన కె. పద్మరాజన్ (65) తన రికార్డును మరింత సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఆయన సోమవారం మెట్టూరు నియోజకవర్గంలో తన 253వ నామినేషన్ దాఖలు చేశారు.
రికార్డుల రారాజు: సేలం జిల్లా మెట్టూరు సమీపంలోని కుంజండియూర్‌కు చెందిన పద్మరాజన్, గత 38 ఏళ్లుగా (1988 నుండి) దేశంలోని అన్ని ప్రధాన ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. అత్యధిక సార్లు ఓడిపోయిన అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది.
దిగ్గజాలతో పోటీ: గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్ వంటి ప్రధానులతో పాటు కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఎడప్పాడి పళనిసామి వంటి హేమాహేమీలపై ఈయన పోటీ చేశారు. మెట్టూరులో నామినేషన్ వేసిన అనంతరం పద్మరాజన్ మాట్లాడుతూ.. తన 254వ నామినేషన్‌ను చైన్నెలోని పెరంబూర్ నియోజకవర్గంలో దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. అక్కడ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ను ఢీకొననున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఇప్పటివరకు ఎన్నికల డిపాజిట్ల కోసం దాదాపు రూ. కోటికి పైగా ఖర్చు చేసినట్లు పద్మరాజన్ వెల్లడించారు. 2011 జరిగిన మెట్టూరు అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన 6,700 ఓట్లే ఇప్పటి వరకు ఆయన సాధించిన అత్యధిక ఓట్ల రికార్డు కావడం గమనార్హం. గెలవడం తన ఉద్దేశం కాదని, ఒక సామాన్యుడు కూడా ఉన్నత స్థాయి వ్యక్తులతో పోటీ పడవచ్చని నిరూపించడమే తన లక్ష్యమని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడమే తన అంతిమ ధ్యేయమని పద్మరాజన్ పేర్కొన్నారు.
ఒకే కుటుంబం.. మూడు పార్టీలు
సాక్షి, చైన్నె : ఎన్నికలలో ఆసక్తికరంగా ఒకే కుటుంబానికి చెంది బిగ్ షాట్‌లు ముగ్గురు పోటీలో ఉన్నారు. అయితే, వీరంతా వేర్వేరు పార్టీల తరపున పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. వీరు తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే రక్తసంబంధం ఉన్నప్పటికీ, సిద్ధాంతపరంగా భిన్నమైన బాటలు ఎంచుకుని తల్లి, కుమారుడు , అల్లుడు ఎన్నికల క్షేత్రంలో తలపడుతున్నారు. వీరంతా లాటరీ కింగ్ మార్టిన్ ఫ్యామిలీకి చెందిన వారు కావడం గమనార్హం. లాల్గుడి అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమా రోజ్ పోటీలోఉ న్నారు. ఆమె కుమారుడు జోష్ చార్లెస్ మార్టిన్ ఎన్‌డీఏ కూటమిలో లక్ష్య జననాయగ కట్చి తరపున పుదుచ్చేరిలోని కామరాజర్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక, లీమా రోజ్ మేనల్లుడు ఆధవ్ అర్జున టీవీకే తరపున విల్లివాక్కంలో పోటీ చేస్తుండటం గమనార్హం. లాటరీ మార్టిన్‌గా పేరుగడించిన వ్యాపార వేత్త కుటుంబానికి చెందిన వారు ఇలా తలా ఓ పార్టీ తరపున పోటీలో ఉండడం రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది. వీరి నామినేషన్లలో ఆస్తులు కోట్లు కోట్లుగా ఉండడం గమనార్హం.


