తాజా అసెంబ్లీ ఎన్నికలతో స్టాలిన్‌ శకానికి ముగింపు పలికేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని టీవీకే అధ్యక్షుడు విజయ్‌ వ్యాఖ్యానించారు. సోమవారం చైన్నెలోని పెరంబూరు నియోజకవర్గం నుంచి తన ఎన్నికల ప్రచారానికి విజయ్‌ శ్రీకారం చుట్టారు. ఒకే రోజు చైన్నెలో నాలుగు నియ | - | Sakshi
Sakshi News home page

తాజా అసెంబ్లీ ఎన్నికలతో స్టాలిన్‌ శకానికి ముగింపు పలికేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని టీవీకే అధ్యక్షుడు విజయ్‌ వ్యాఖ్యానించారు. సోమవారం చైన్నెలోని పెరంబూరు నియోజకవర్గం నుంచి తన ఎన్నికల ప్రచారానికి విజయ్‌ శ్రీకారం చుట్టారు. ఒకే రోజు చైన్నెలో నాలుగు నియ

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

● పెరంబూర్‌ నుంచి ప్రచారానికి శ్రీకారం ● భద్రతా కారణాలతో రెండు చోట్ల రద్దు

టీవీకే అధినేత విజయ్‌ వ్యాఖ్య

నామినేషన్‌ దాఖలుకు వస్తున్న విజయ్‌

సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలలో టీవీకే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో టీవీకే అధినేత విజయ్‌ చైన్నెలోని పెరంబూరు నియోజవర్గంలో, తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. ఆదివారం అభ్యర్థులను ప్రకటించిన విజయ్‌ సోమవారం ఉదయం తాను పోటీ చేస్తున్న శ్రీపెరంబదూరు నియోజవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా నామినేషన్‌ దాఖలు చేయడానికి వచ్చిన విజయ్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. నిర్ణీత సమయం కంటే ముందుగా పెరంబూరులో ప్రచార వేదిక వద్దకు చేరుకుని విజయ్‌ అందరికి అభివాదం తెలుపుతూ పలకరించారు.

విజయ్‌ భావోద్వేగ ప్రసంగం

తనను ప్రేమించే వారు ఉన్న చోటు నుండి ప్రచారం మొదలుపెట్టాలనుకున్నానని, ఈ మేరకు తమిళనాడు అంతా తనకు ఇష్టమే అయినప్పటికీ, ఇందులో పెరంబూరు నుంచి ప్రయాణం మొదలెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేయాలని, ఇక్కడి నుంచే ప్రచారం చేపట్టాలని తన మనస్సు చెప్పిందని, ఉత్తర చైన్నెకి ఐకానిక్‌ ప్రదేశాలో మాతా చర్చి, ప్రసిద్ధ ఆలయాలు, మసీదులు ఈ గడ్డలోనే ఉన్నాయంటూ భావోద్వేగంతో వ్యాఖ్యలు చేశారు.

డీఎంకేపై నిప్పులు

రాష్ట్రంలో మాదకద్రవ్యాల విచ్చలవిడితనం, మహిళలపై దాడులు పెరిగిపోయాయని విజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట మహిళలు బయటకు రావాలన్నా, టీ కొట్టుకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉందన్నారు. సామాన్యుడి ప్రాణాలకు రక్షణ ఇవ్వ లేని ఈ ప్రభుత్వం కేవలం తమ కుటుంబ ఆస్తులను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. ఈ ఎన్నికలతో స్టాలిన్‌ పాలనకు చరమగీతం పాడటం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

యువతకు పిలుపు

ఉద్యోగాల భర్తీలో జరిగిన అవినీతి, యువతకు జరుగుతున్న మోసాలు, చేస్తున్న అన్యాయాలపై కొత్త తరం జెన్‌–జీ ఓటర్లు దృష్టి పెట్టాలని పిలుపు నిచ్చారు. దోచుకున్న డబ్బుతో ఈ పాలకులు ఓటుకు నోటు ఇస్తే.. ఆ డబ్బు తీసుకోండని, అయితే, పోలింగ్‌ బూత్‌లో మాత్రం వారి చెవిలో ’విజిల్‌’ వేసినట్లుగా టీవీకే గుర్తుకే ఓటు వేసి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.వారు ఇచ్చే డబ్బు తీసుకోండి – మార్పు కోసం ఓటు వేయండి అంటూ పిలుపు నిచ్చారు.

ఒక్క అవకాశం ఇవ్వండి

తనను మీ ఇంటి బిడ్డగా, అన్నగా, తమ్ముడిగా భావించి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించారు. యువత అంతా ఉత్సాహంగా పాల్గొని ’విజిల్‌’ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. డీఎంకేది వైఫల్యాల పాలన అని పేర్కొంటూ, యువత ఓటింగ్‌ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని కొత్త రాజకీయ మార్పుకు నాంది పలకాలని ఆయన కోరారు. ఈ ఎన్నికలతో స్టాలిన్‌ శకం ముగియనున్నదని పేర్కొంటూ, తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని ధీమా వ్యక్తంచేశారు.

భద్రతా కారణాలతో రద్దు

విజయ్‌ సోమవారం నాలుగు చోట్ల ప్రచారానికి నిర్ణయించారు. తొలుత పెరంబూరులో విజయవంతంగా ప్రచార కార్యక్రమం జరిగింది. అనంతరం తిరువీకా నగర్‌లో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత విల్లివాక్కం, అన్నానగర్‌ నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాలను ఎత్తి చూపుతూ సాయంత్రం ఐదు గంటల సమయంలో విజయ్‌ ప్రచారం రద్దు చేసినట్టు టీవీకే వర్గాలు ప్రకటించాయి. దీంతో విజయ్‌ కోసం ఎదురు చూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement