నైనార్‌పై మనీ లాండరింగ్ కేసుకు డిమాండ్
సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదుకు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో రైలులో పట్టుబడ్డ నగదు నైనార్ నాగేంద్రన్‌కు చెందినదిగా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ విచారణ చేస్తోంది. ఈ పరిస్థితులలో నైనార్ నాగేంద్రన్, ఆ పార్టీ నేత కేశవ వినాయగంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి విచారించే విధంగా ఈడీని ఆదేశించాలని డీఎంకే ఎంపీ గిరిరాజన్ పిటిషన్ దాఖలు చేశారు.
రూ.1.50 లక్షల స్వాధీనం
తిరుత్తణి: తిరుత్తణిలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ గురువారం తనిఖీలు నిర్వహించి ఆధారాలు లేకుండా తీసుకెళ్లిన రూ. 1.50 లక్షలు స్వాధీ నం చేసుకున్నారు. తిరుత్తణి సమీపంలోని చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి వైపు వెళుతున్న కారును తనిఖీ చేశారు. తనిఖీల్లో ఆధారాలు లేని రూ.1.50 లక్ష స్వాధీనం చేసుకొని ఆర్డీఓ కార్యాలయంలో అప్పగించారు. విచారణలో తిరుపతికి చెందిన డాక్టర్ శోభన శ్రీపెరంబదూరులో బంధువుల ఇంటికి వెళుతుండగా స్వాధీనం చేసుకున్నట్లు విచారణలో తేలింది.
కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
తిరువళ్లూరు: జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ఈవీఎంలను రెండు ప్రాంతాల్లో భద్రపరిచి కౌంటింగ్ చేయాలని నిర్ణయించిన క్రమంలో ఏర్పాట్లను కలెక్టర్, ఆవడి పోలీస్‌కమిషనర్ గురువారం ఉదయం పరిశీలించారు. తిరువళ్లూరు, మాధవరం, తిరుత్తణి, పూందమల్లి, గుమ్మిడిపూండి, పొన్నేరి, మధురవాయల్, ఆవడి, అంబత్తూరు, తిరువొత్తియూరు పది అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అనంతరం గుమ్మిడిపూండి, పొన్నేరి, తిరుత్తణి, తిరువళ్లూరు ఈవీఎంలను సెవ్వాపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనూ, మాధవరం, మధురవాయల్, పూందమల్లి, ఆవడి, అంబత్తూరు, తిరువొత్తియూరు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను పెరుమాల్‌పట్టులోని శ్రీరామ్ విద్యాసంస్థల్లో భద్రపరచనున్నారు. గతంలో పది స్థానాలకు చెందిన ఈవీఎంలను పెరుమాల్‌పట్టులో భద్రపరిచి కౌంటింగ్ నిర్వహించేవారు. అయితే ఈ సారి రెండు ప్రాంతాల్లో కౌంటింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈక్రమంలో రెండు కౌంటింగ్ కేంద్రాలను తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్, కమిషనర్ ప్రేమానంద్‌సిన్హా పరిశీలించారు. ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహించి పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఈవీఎంలు భద్రపరిచే ప్రాంతాలు, కౌటింగ్ నిర్వహించే ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
టిప్పర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం
కొరుక్కుపేట: ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. చెంగల్పట్టు సమీపంలోని మామండూర్ ఫ్లైఓవర్‌పై ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి టిప్పర్ ఢీకొనడంతో ఈప్రమాదంలో బైక్‌లో వెళుతున్న అబిమాష్, జాన్ చార్లెస్ అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో మృతులు ఇద్దరూ తిరువళ్లువర్ జిల్లా, ఆవడి, కామరాజర్ నగర్‌కు చెందినవారని, ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారని తెలిసింది. ఈ సంఘటన కారణంగా తిరుచి–చైన్నె జాతీయ రహదారిపై ఇరువైపులా రెండు గంటలకు పైగా భారీ ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉన్నత పరిశోధనపై
జాతీయ సదస్సు
కొరుక్కుపేట: ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ – వడపళని క్యాంపస్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మెకానికల్ సైన్సెస్‌లో ఉన్నత పరిశోధనపై జాతీయ సదస్సును గురువారం నిర్వహించారు. సదస్సుకు దేశం నలుమూలల నుంచి ప్రముఖ విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు విద్యా ర్థులు పెద్ద ఎత్తున విచ్చేశారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఆర్. రాజారామన్ ఎస్ ఆర్ ఎం వడపళని క్యాంపస్ వైస్ ప్రిన్సిపల్, డాక్టర్ సి. గోమతి, డీన్ డాక్టర్ సి. వి. జయకుమార్ ప్రసంగించారు. సమకాలీన సవాళ్లను పరిష్కరించడంలో, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో మెకానికల్ ఇంజినీరింగ్ పరిశోధన ప్రాముఖ్యతను వారు వివరించారు. పొన్నేరిలోని నెల్‌కాస్ట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ కె.వరదరాజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కామాక్షి పాల్గొన్నారు.
టీవీకేలోకి కాంగ్రెస్ నేతలు
సాక్షి,చైన్నె : విజయ్ టీవీకేలో పలువురు కాంగ్రెస్ నేతలు గురువారం చేరారు.ఇందులో కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి సెల్వం కూడా ఉన్నారు. ఆయన తో పాటుగా మద్దతుదారులు చైన్నెలో విజయ్ సమక్షంలో టీవీకే తీర్థం పుచ్చుకున్నారు. అలాగే, సింగపూర్‌కు చెందిన వ్యాపార వేత్త ఒకరు టీవీకేలో చేరినట్టు సమాచారం. ఆయన తమిళనాడుకు చెందిన వారు కావడంతో మన్నార్‌కుడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అలాగే, విజయ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ సిద్ధం చేశారు. రోజుకు ఐదు నియోజకవర్గాలలో ఆయన పర్యటించనున్నారు. 28వ తేదిన చైన్నె పెరంబూరు నియోజకవర్గంలో ఈ ప్రచారం ప్రారంభం కానుంది.


