సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న ,వారికి సీట్ల కేటాయింపులో గుర్తింపు దక్కలేదు. బీజేపీ, అన్నాడీఎంకే, కాంగ్రెస్, డీఎంకేలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇవ్వక పోవడంచర్చకు దారి తీసింది. 30 స్థానాలతో కూడిన పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనుంది. నామినేషన్ల పర్వం, ఉపసంహరణ గురువారంతో ముగిసింది. అయితే, పుదుచ్చేరి రాజకీయాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రధాన రాజకీయ పార్టీలు వెనుకబడి ఉన్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే, మహిళా సాధికారత కేవలం ప్రసంగాలకే పరిమితమైందని స్పష్టమవుతోంది.
తగ్గుతూ వస్తున్న సంఖ్య
పుదుచ్చేరి మొదటి అసెంబ్లీ (1963–64)లో సరస్వతి సుబ్బయ్య, సావిత్రి వంటి మహిళా నేతలు ఉండేవారు. కాలక్రమేణా ఈ సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2016లో నలుగురు మహిళా ఎమ్మెల్యేలు గెలవగా, 2021లో కేవలం చంద్ర ప్రియంక మాత్రమే ఎన్నికయ్యారు. ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. 2026 ఎన్నికల్లో పార్టీల వారీగా మహిళా అభ్యర్థులను పరిశీలిస్తే తక్కువే. నామ్ తమిళర్ కట్చి మాత్రం 50 శాతం సీట్లను ఏటాయించింది. 28 చోట్ల తాము పోటీ చేయా 14సీట్లు కేటాయించి వారిపై ఉన్న గౌరవాన్ని చాటుకుంది. ఇక, అధికార ఎన్.ఆర్. కాంగ్రెస్ 16 స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికి మాజీ మంత్రి చంద్ర ప్రియాంక, మాజీ ఎమ్మెల్యే గోపికకు అవకాశం కల్పించారు. ఇక విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం 28 స్థానాల్లో పోటీ చేస్తూ, ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించింది. ఇక 16 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పటికీ మహిళా అభ్యర్థికి సీటు ఇవ్వక పోవడం గమనార్హం. అలాగే డీఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే సైతం పుదుచ్చేరిలో ఒక్క మహిళా అభ్యర్థిని కూడా తమ పార్టీల తరపున నిలబెట్టక పోవడం శోచనీయం. పార్లమెంటులో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన బీజేపీ కానీ, సామాజిక న్యాయం గురించి మాట్లాడే డీఎంకే కానీ ఒక్క మహిళా అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు బయలుదేరాయి.


