సాక్షి, చైన్నె: పుదుచ్చేరిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ డీఎంకే, కాంగ్రెస్ కూటమిలో బుధవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. డీఎంకే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే పనిలో పడడంతో కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పరుగులు తీశారు. ఇక ఎన్‌ఆర్ కాంగ్రెస్– బీజేపీ కూటమి పంచాయితీ సైతం ఢిల్లీకి చేరింది. తమిళనాడుకు పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తాజాగా ఎన్‌ఆర్ కాంగ్రెస్ – బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకేలు వ్యూహాలకు పదును పెట్టాయి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘెరంగా పతనాన్ని చవి చూసిన దృష్ట్యా, ఈసారి తమ నేతృత్వంలో ఎన్నికలను ఎదుర్కొనే దిశగా డీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. ఎంపీ జగద్రక్షకన్‌ను రంగంలోకి దించడంతో ఆయన గత కొంత కాలంగా పుదుచ్చేరిలో తిష్ట వేసి వ్యూహాలను అమలు చేస్తూ వచ్చారు. తాజాగా కాంగ్రెస్, డీఎంకే మధ్య నేతృత్వం వ్యవహారం ఓ వైపు వివాదానికి దారి తీసినా, మరోవైపు సీట్లు సమానంగా పంచుకునే దిశగా పుదుచ్చేరి డీఎంకే నేతలు నిర్ణయించారు. పుదుచ్చేరిలోనూ నేతల అభిప్రాయాలకు పార్టీ అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మంగళవారం చైన్నెలో పుదుచ్చేరి నేతలతో గంటల తరబడి సమాలోచన జరిపారు. అలాగే ఆశావహులను ఇంటర్వ్యూ కూడా చేశారు. ఈ పరిణామాలు పుదుచ్చేరి కాంగ్రెస్‌లో కలవరాన్ని రేపనట్లయ్యింది. అదే సమయంలో బుధవారం డీఎంకే అభ్యర్థులు పుదుచ్చేరి, మాగే, కారైక్కాల్ తదితర ప్రాంతాలలో నామినేషన్లు దాఖలు చేయడం మరింత టెన్షన్‌లో పడేసినట్లయ్యింది. డీఎంకే పుదుచ్చేరి నేత సంపత్ మొదలియార్ పేట నియోజకవర్గంలో నామినేషన్ సమర్పించినానంతరం అన్ని స్థానాలలో తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నట్టు ప్రకటించడం గమనార్హం.
ఢిల్లీకి నేతల పరుగులు
డీఎంకే దూకుడు నేపథ్యంలో పుదుచ్చేరి కాంగ్రెస్ వర్గాలలో కలవరం బయలు దేరింది. దీంతో బుధవారం ఉదయాన్నే పార్టీ ఇన్‌చార్జ్ గిరిశ్ చోదన్కర్, నేతలు వైద్యలింగం, నారాయణ స్వామి తదితరులు ఢిల్లీకి ఉరకలు తీశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గేతో సమావేశమయ్యారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సంప్రదింపు జరిపి సీట్ల సర్దుబాటును కొలిక్కి తీసుకు రావాలని విన్నవించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై ఢిల్లీ పెద్దలు డీఎంకేతో చర్చలకు సన్నద్దమయ్యారు. నామినేషన్లు 23వ తేదీ చివరి రోజు కావడం గమనార్హం. అదే సమయంలో రంజాన్, శని, ఆదివారాలు సెలవులు సైతం వస్తుండడంతో అంతలోపు సీట్ల పంపకాలను ముగించి అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ ఉరకలు తీస్తోంది.
బీజేపీలోనూ అదే తంతు..
పుదుచ్చేరి ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి బీజేపీకి పెద్ద షాక్కే ఇచ్చారు. సీట్ల పంపకాల ప్రక్రియకు బహిష్కరించి, తన ప్రతినిధులను మాత్రం పంపించి కొన్ని డిమాండ్లను ఉంచడంతో ఈ కూటమికి బీటలు తప్పదన్న చర్చ జోరందుకుంది. 16 స్థానాలలో తాము పోటీ చేస్తామని ఎన్‌ఆర్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. అలాగే, మిగిలిన 14ను బీజేపీకి కేటాయిస్తూ, ఇందులో అన్నాడీఎంకే సర్దుబాటు చేసుకోవాలని, లక్ష్య జననాయగ కట్చిని కూటమిలోకి అనుమతించమమని స్పష్టం చేయడం గమనార్హం. రంగన్న అల్టిమేటం నేపథ్యంలో బీజేపీ నేతలు పుదుచ్చేరి హోంమంత్రి నమశ్శివాయం, స్పీకర్ ఎన్బలం సెల్వంతో పాటూ ముఖ్య నాయకులు ఢిల్లీకి పరుగులు తీశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయన ద్వారా రంగ స్వామిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు విస్తృతం చేయడం గమనార్హం.


