సాక్షి, చైన్నె: ఇన్ స్టా స్టార్స్‌గా అందరి దృష్టిలో పడ్డ ఇద్దరు పిల్లలను సీఎం స్టాలిన్ తన ఛాంబర్‌కు పిలిపించారు. వారితో కలిసి కాసేపు సరదగా సందడి చేస్తూ గడిపారు. శ్రీరీల్స్ బాగున్నాయి.. చదువు ఇంకా బాగుండాలిశ్రీ అంటూ చిన్నారులకు పిలుపు నిచ్చారు. వివరాలు.. సోషల్ మీడియాలో తమ విలక్షణమైన వీడియోలతో వైరల్‌గా మారిన ఇన్‌స్ట్రాగామ్ చిన్నారులు దేవా, జీవాలను ఎం.కె. స్టాలిన్ ప్రత్యేకంగా అభినందించారు. కడలూరు జిల్లా బన్రుట్టికి చెందిన ఈ చిన్నారులు, విద్య ప్రాముఖ్యతను హాస్యంతో జోడించి చెబుతూ నెటిజన్ల మనసు గెలుచుకున్నారు. వీరి ప్రతిభను గుర్తించిన సీఎం, వారిని తన కార్యాలయానికి ఆహ్వానించి కొద్దిసేపు సరదాగా గడిపారు.
ఆప్యాయంగా పలకరింపు
చిన్నారులు దేవా, జీవాలతో సీఎం స్టాలిన్ కాసేపు ముచ్చటించారు. చాలామంది రీల్స్ చేస్తుంటారు, కానీ మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? మీ వీడియోల్లో చదువు గురించి గొప్పగా చెబుతున్నారు అని వారిని ప్రశంసించారు. కేవలం రీల్స్ చేయడమే కాకుండా, చదువులోనూ అదే జోరు చూపించాలని చిన్నారులకు సీఎం సూచించారు. రీల్స్, లైక్స్‌లో కన్నా మార్కులు, డిగ్రీల్లోనే అసలైన ‘గెత్తు’ (గెలుపు/గౌరవం) ఉందన్నారు. చివరకు ఆ చిన్నారుల కోరిక మేరకు సీఎం స్టాలిన్ వారితో కలిసి ఒక చిన్న రీల్ వీడియోలో కూడా పాల్గొన్నారు. ఈ వీడియోను సీఎం తన ఎక్స్ పేజీ ఖాతాలో షేర్ చేస్తూ, చిన్నారుల మాట తీరును మెచ్చుకున్నారు. చిన్నారులకు తన సంతకం చేసిన పుస్తకాలను, పెన్నులను సీఎం బహుమతిగా అందజేశారు.
వైరల్ అవుతున్న స్టాలిన్ విత్ దేవా, జీవ
సాధారణంగా రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండే సీఎం స్టాలిన్, ఇలా చిన్నారులతో కలిసి సమయాన్ని గడపడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. పిల్లలను చదువు వైపు మళ్లించేలా సీఎం ఇచ్చిన సందేశంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. స్టాలిన్ విత్ దేవా, జీవ పేరిట ఇన్ స్టా రీల్ వైరల్‌గా మారింది.


