సాక్షి, చైన్నె : డీఎంకే కూటమితో సీట్ల పంపకాల విషయంగా ఎలాంటి విభేదాలు లేవని ఎండీఎంకే నేత వైగో స్పష్టంచేశారు. చైన్నె ఎగ్మూర్‌లోని ఎండీఎంకే కార్యాలయంలో బుధవారం పార్టీ అత్యవసర ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. పార్టీ రాజకీయ సలహా కమిటీ అధ్యక్షుడు ఆడిటర్ అర్జున రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వైకో రాబోయే ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడుతూ డీఎంకే కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. తాము డీఎంకేకు మద్దతు ఇస్తున్నామన్నారు. సీట్ల పంపకాల విషయంలో చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నదన్నారు. ఏ గుర్తుపై పోటీ చేయాలి, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే అంశాలపై ఉన్న గందరగోళాన్ని తాజాగా పరిష్కరించుకునేందుకు మావేశమయ్యామన్నారు. గత తొమ్మిదేళ్లుగా తాము డీఎంకే కూటమిలో కొనసాగుతున్నామని ఈసందర్భంగా ఆ పార్టీ డిప్యూటీ ప్రధానకార్యదర్శి, ఎంపీ దురై వైగో గుర్తు చేశారు. కూటమిలోకి మరిన్ని పార్టీలు రావడంతో నియోజకవర్గాల సంఖ్యను సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సామాన్య ప్రజలు, తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అని, పదవుల కంటే రాష్ట్ర శ్రేయస్సు కోసమే ఎండీఎంకే పనిచేస్తున్నదన్నారు. సీట్ల పంపకాల ప్రక్రియలో ఎలాంటి జాప్యం ఉండదని, త్వరలోనే స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.


