తిరుచ్చి మహానాడుకు హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న స్టాలిన్
సాక్షి, చైన్నె: తిరుచ్చి సిరగనూరులో సోమవారం డీఎంకే ఎన్నికల మహానాడు జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖం పూరించే విధంగా డీఎంకే శ్రేణులు లక్షల్లో ఈ మహానాడుకు తరలి వచ్చారు. సుమారు 10 లక్షల మందితో ఈ మహానాడు నిర్వహించారు. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేఎన్ నెహ్రూ నేతృత్వంలో జరిగిన ఈ మహానాడుకు డీఎంకే శ్రేణులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ కదలి వచ్చారు. ఉదయం నుంచి జనం పోటెత్తుతూ రావడంతో వారికి కావాల్సిన ఆహారం, నీళ్లు వంటి వాటిని కిట్ల రూపంలో ముందుగానే అందజేశారు. ఈ మహానాడు నిమిత్తం ఉదయాన్నే చైన్నె నుంచి తిరుచ్చి చేరుకున్న సీఎం స్టాలిన్‌కు డీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. దారి పొడవున నిలబడ్డ జనాన్ని పలకరిస్తూ స్టాలిన్ ముందుకు సాగారు.
మహానాడు నిమిత్తం తిరుచ్చినుంచి సాయంత్రం సిరుగనూరుకు చేరుకున్న సీఎం స్టాలిన్ తన వాహనంలో ఆ పరిసరాలన్నీ తిరుగుతూ కేడర్‌ను పలకరించారు. సుమారు 200 మీటర్ల మేరకు ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై ఆయన నడుచుకుంటూ కేడర్‌ను పలకరించారు. ఈ మహానాడుకు స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, డిప్యూటీ సీఎం, తనయుడు ఉదయనిధి సైతం హాజరయ్యారు. ఈ మహానాడులో సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ,డీఎంకే చరిత్రలో తిరుచ్చికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యతను గుర్తుచేశారు. తాను పుట్టగానే చంటి బిడ్డగా ఉన్న తనను తిరుచ్చికి తల్లి దయాళు అమ్మల్ తీసుకొచ్చారనిపేర్కొన్నారు. ఇక్కడి జైలలో ఉన్న తన తండ్రి కరుణానిధి తనను ప్రపథమంగా చూసింది ఆ సమయంలోనేనని వివరించారు. అలాగే 1956లో దివంగత నేత అన్నాదురై నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది ఇక్కడే అని గుర్తు చేశారు. 1957లో దివంగత నేత కరుణానిధి ఇక్కడి కుళితలై నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొన్నారు. 1970లో పార్టీ ఐదు ప్రధాన సూత్రాలను ఇదే గడ్డ నుంచి ప్రకటించారన్నారు.
2021 ఎన్నికలకు ముందు తాను ఇక్కడి నుంచే వాగ్దానాలు ఇచ్చానని గుర్తుచేస్తూ, అవన్నీ ఇప్పుడు విజయవంతంగా అమల్లో ఉన్నాయన్నారు. ఇదే వేదికపై నుంచి తన విజ్ఞప్తికి మన్నించి, తన మీద నమ్మకంతో ఓట్లు వేసి సీఎంను ఈ రాష్ట్ర ప్రజలు చేశారని వివరించారు. దివంగత నేతలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ప్రజల ఓట్ల ద్వారా సీఎం అయ్యారని, ఆ తదుపరి వరుసలో తననే ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్నట్టు తెలిపారు. నేడు తమిళనాడు అన్నింటా ప్రగతి పథంలో దూసుకెళ్తోందని, అందుకే ఈరాష్ట్రాన్ని దోచుకునేందుకు అన్నాడీఎంకే అనే ముసుగులో కాషాయం వస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మతతత్వ శక్తుల ముసుగులను తొలగించి,వారి బండారాలను ప్రజలముందు పెడుతామన్నారు. ఎన్ని వేషాలతో వచ్చినా, ఈ కాషాయానికి తమిళనాట నో ఎంట్రీ అని స్పష్టం చేశారు. ఈ డబ్బా ఇంజిన్‌కు నో ఎంట్రీ అని వ్యాఖ్యలు చేశారు. మళ్లీ చెబుతున్నానని 2026 ఎన్నికలు తమిళనాడు వర్సెస్ ఢిల్లీమధ్య జరిగే సమరం అని స్పష్టంచేశారు. తమిళనాడుకు తమిళభాషకు , తమిళ సంస్కృతికి ప్రత్యర్థి ఎవరో అన్నది తమకు తెలుసునని, అందుకే వారిని ఢీ కొట్టగలిగే ఒకే ఒక శక్తి డీఎంకే మాత్రమేనని ధీమా వ్యక్తంచేశారు. అన్నాడీఎంకేను కొంచెం కొంచెంగా ఆక్రమిస్తూ వస్తున్న ప్రత్యర్థిని లాస్ట్ బాల్‌లో సిక్సర్ కొట్టి ఫినిషింగ్‌తో విజయాన్ని సొంతం చేసుకుంద్దామని కేడర్‌కు పిలుపు నిచ్చారు.
డీఎంకే మ్యానిఫెస్టో సోదరి కనిమొళి నేతృత్వంలో సిద్ధం అవుతున్నదని, ద్రావిడ మోడల్ రికార్డులను బద్దలు కొట్టే రీతిలో ప్రజల కలలను సాకారం చేసే విధంగా ఇందులో వాగ్ధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. ఇతరుల వలే ఇన్‌స్టాల్ మెంట్ మ్యానిపెస్టోను డీఎంకే విడుదల చేయదని, అన్నీ పక్కగానే ఉంటాయని, అన్నీ అధికారంలోకి రాగానే అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. తమ పథకాలను కాపికొట్టేస్తూ, సంఖ్యను, నగదు మొత్తాలను పెంచేస్తూ, కొన్ని పార్టీలు తాజాగా ప్రకటనలు విడుద లచేయడం హాస్యాస్పదంగాఉందన్నారు.
‘‘తమిళనాడును, తమిళ ప్రజలను, తమిళ భాషను పరిరక్షించేందుకు మళ్లీ మళ్లీ మేమే గెలుస్తాం..విజయ శంఖారావం పూరిస్తూనే ఉంటాం’’ అని తిరుచ్చి వేదికగా సీఎం ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. తిరుచ్చి మలుపునకు వేదిక అని పేర్కొంటూ, ఇక్కడ జరిగిన ఈమహానాడుతో రానున్న ఎన్నికలలో మరిన్ని రికార్డులను బద్దలు కొడుదామని కేడర్‌కు పిలుపు నిచ్చారు.
ప్రజలు ఓట్లు వేస్తేనే సీఎం అయ్యాను..
బ్రహ్మాండ ఆహ్వానం
ఎవరికీ తలొగ్గం..
డీఎంకే చూడని బెదిరింపులు లేవు అని, దేశంలో ఏరాష్ట్రంలోనైనా కావాలంటే కాషాయం రంగు పూసుకోండి..ఇక్కడ తమరి పాచికలు పారవు అని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అభ్యర్థుల గెలుపు కోసం ఏ మేరకు శ్రమిస్తున్నారో, అదే తరహాలో కూటమి పార్టీల అభ్యర్థుల కోసం పనిచేయాలని ఈసందర్భంగా కేడర్‌కు పిలుపు నిచ్చారు. రెండు నెలలు అవిశ్రాంతంగా శ్రమించాలని, సిద్ధాంతపరంగా కొనసాగుతున్న డీఎంకే కూటమి 200 స్థానాల్లో జయకేతనమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లాలని కోరారు. తాను చెబుతునాన్నని, ద్రావిడ మోడల్ 2.ఓ ఏర్పాటు కావడం తథ్యమని, ఇది రికార్డుల బద్దలు కొట్టే పాలనగా మారుతుందని, తమిళనాడు దేశంలోనే నెంబర్ –1గా నిలబడటం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడు రక్షణ కోసం ఎన్ని ఎన్నికలు వచ్చినా గెలుపు తమదేనని, విజయాల పర్వం కొనసాగుతుందని, విజయపుశంఖారావం మర్మోగుతూనే ఉంటుందని వ్యాఖ్యలు చేశారు.


