‘జమిలి’ అత్యంత ప్రమాదకరం | - | Sakshi
Sakshi News home page

‘జమిలి’ అత్యంత ప్రమాదకరం

Mar 10 2026 7:34 AM | Updated on Mar 10 2026 7:34 AM

– సీఎం స్టాలిన్‌ వ్యాఖ్య

సాక్షి, చైన్నె : ఒకే దేశం – ఒకే ఎన్నికలు( జమిలి) వ్యాధి కంటే ప్రమాదకరమైన మందు అని సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ’ఒకే దేశం – ఒకే ఎన్నికలు’ విధానంపై స్టాలిన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది వ్యాధిని నయం చేయడానికి ఇచ్చే అత్యంత భయంకరమైన మందు వంటిదని అని అభివర్ణించారు. ఈ విధానం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులనే మార్చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో పలు అంశాలను ప్రస్తావించారు. 2019లో ఇండోనేషియాలో జాతీయ, ప్రాంతీయ , స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారని గుర్తుచేశారు. ఖర్చులు తగ్గించుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం 900 మంది ఎన్నికల సిబ్బంది ప్రాణాలను బలిగొందని, 5,000 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారని వివరించారు. దీనివల్ల ఏర్పడిన ఒత్తిడిని గమనించిన ఇండోనేషియా కోర్టు, 2029 నుండి మళ్లీ విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.

రాజ్యాంగ విరుద్ధం..

భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు కేవలం పరిపాలనా విభాగాలు కావని, వాటికి ప్రత్యేక గుర్తింపు ఉందని స్టాలిన్‌ స్పష్టం చేశారు. ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలాన్ని తగ్గించే అధికారం కేంద్రానికి లభిస్తుందన్నారు.

ఇది రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నిరంతరం ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. అయితే, తరచుగా జరిగే ఎన్నికలు ప్రజల నాడిని తెలుసుకోవడానికి ప్రభుత్వాలకు ఒక అవకాశం కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. హఠాత్‌ పరిణామం, కాలం కారణంగా ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో పడిపోతే, అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఎన్నికై న ప్రభుత్వం కేవలం మిగిలిన కాలం మాత్రమే పదవిలో ఉంటుందే గానీ, పూర్తిగా ఐదేళ్లు ఉండదు అని వివరించారు. ఇది ఓటు విలువను తగ్గించడమే కాకుండా, స్వల్పకాలిక ప్రభుత్వాలు దీర్ఘకాలిక అభివృద్ధి పనులపై దృష్టి పెట్టకుండా చేస్తాయని స్టాలిన్‌ విమర్శించారు.

ఆర్థికంగానూ నష్టమే..

ఎన్నికల ఖర్చును తగ్గించుకోవచ్చనే వాదనను ఆయన తోసిపుచ్చారు. పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ లెక్కల ప్రకారం, ఎన్నికల ఖర్చు కేంద్ర బడ్జెట్‌లో కేవలం 0.25 శాతం మాత్రమే నని పేర్కొన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే భారీ సంఖ్యలో ఈవీఎంలు, భద్రతా పరమైన అంశాలు అవసరమవుతాయన్నారు. దీనివల్ల ఖర్చు తగ్గకపోగా మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. ‘ప్రజాస్వామ్యం కోసం చేసే ఖర్చు భారం కాదని, అది ప్రజల స్వేచ్ఛ కోసం చెల్లించే మూల్యం‘ అని వ్యాఖ్యలు చేశౠరు. జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ కమిటీ కూడా ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని సూచించిందని, ఇండోనేషియా చేసిన తప్పును భారత్‌ పునరావృతం చేయకూడదని కేంద్రాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement