‘కూటమి’లో ఠాకూర్‌ చిచ్చు | - | Sakshi
Sakshi News home page

‘కూటమి’లో ఠాకూర్‌ చిచ్చు

Feb 17 2026 7:53 AM | Updated on Feb 17 2026 7:53 AM

‘కూటమి’లో ఠాకూర్‌ చిచ్చు

‘కూటమి’లో ఠాకూర్‌ చిచ్చు

● ఖర్గే సమక్షంలో పంచాయితీ ● బెంగళూరుకు టీఎన్‌సీసీ అధ్యక్షుడి పరుగులు ● వారేమైనా గొప్ప వారా..? ఇక, సహించమని హెచ్చరిక ● స్టాలిన్‌కు మణి శంకరయ్యర్‌ పొగడ్తలు

డీఎంకే సీరియస్‌

సాక్షి, చైన్నె : డీఎంకే – కాంగ్రెస్‌ కూటమిలో విరుదునగర్‌ ఎంపీ మాణిక్యం ఠాకూర్‌ రగిల్చిన వ్యాఖ్యల చిచ్చు రాజుకుంది. ఇది కాస్త కూటమిలో వివాదానికి పరిస్థితులు కల్పించడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే అలర్ట్‌ అయ్యారు. తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై సోమవారం ఉదయాన్నే హుటా హుటీన బెంగళూరుకు వెళ్లారు. మాణిక్యం ఠాకూర్‌, ప్రవీన్‌ చక్రవర్తిలు లేమైనా గొప్ప నాయకులా? , ఇక సహించం అంటూ సెల్వ పెరుంతొగై హెచ్చరికలు చేయడం గమనార్హం. వివరాలు.. డీఎంకే నుంచి ఈసారి అధిక సీట్లు రాబట్టడమే కాకుండా, అధికారంలో వాటా అన్నది ముందుగానే ఽధ్రువీకరించాలన్న నినాదం తమిళనాడు కాంగ్రెస్‌లో మిన్నంటుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఏఐసీసీ నేత, లోక్‌ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వద్దకు సైతం వెళ్లింది. కూటమి పెద్దన్న డీఎంకేను అయితే విరుదునగర్‌ఎంపీ మాణిక్యం ఠాకూర్‌ ఓ వైపు, ఏఐసీసీ నేత ప్రవీణ్‌ చక్రవర్తి మరో వైపు విమర్శలు చేస్తూ రావడం చర్చకు దారి తీసింది. పదేపదే ఈ ఇద్దరు డీఎంకేను టార్గెట్‌ చేస్తూ రావడం కూటమిలో చిచ్చు పెట్టినట్టుగా పరిస్థితులు దారి తీశాయి. కాంగ్రెస్‌ తీరును డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్‌ నిశితంగా పరిశీలిస్తూ వచ్చిన నేపథ్యంలో మదురై వేదికగా మాణిక్యం ఠాకూర్‌ ఓవపు, ఎక్స్‌ పేజీ వేదికగా ప్రవీణ్‌చక్రవర్తి మరోవైపు తన ప్రభుత్వాన్ని, తన పార్టీని టార్గెట్‌ చేయడాన్ని తీవ్రంగా పరిగణించినట్టున్నారు. ఇందుకు అనుగుణంగా తాజా పరిస్థితులు వ్యవహారంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నిర్ణయం ఏమిటో? పార్టీ అంతర్గత కలహాల కారణంగా బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌ వంటి అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్‌ రాణించ లేకుండా పోతోందంటూ డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్‌ ఇళంగోవన్‌ వ్యాఖ్యల తూటాలను అందుకోవడం గమనార్హం.

బెంగళూరుకు పయనం

మాణిక్యం ఠాకూర్‌ తీరుపై కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేలు పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. కూటమికి వ్యతిరేకంగా మాట్లాడితే, అది రాహుల్‌కు వ్యతిరేకంగా మాట్లాడినట్టే అని టీఎన్‌సీసీ నేతలు గోప్పన్న తదితరులు వ్యాఖ్యల తూటాలను అందుకున్నారు. అదే సమయంలో ఖర్గే నుంచి వచ్చిన పిలుపుతో టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై చైన్నె నుంచి ఉదయాన్నే బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, బహిరంగంగా సీట్లు, కూటమి వ్యవహారాలు మాట్లాడ వద్దని పదే పదే హెచ్చరిస్తున్న మాణిక్యం ఠాకూర్‌ వంటి పలువురు ఖాతరు చేయక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంగా చర్చించేందుకు వెళ్తున్నానని, కూటమి గురించి మాట్లాడేందుకు ఠాకూర్‌ ఎవరు, ప్రవీణ్‌ చక్రవర్తి ఎవరు? అని ప్రశ్నిస్తూ, ఈ ఇద్దరు ఏమైనా కాంగ్రెస్‌లో రాహుల్‌, ఖర్గే కన్నా గొప్ప వ్యక్తులా..? అని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగాఎంపికై న పదవిలో ఉన్న వాళ్లు, ఇలాగా వ్యవహరించేది అని శివాలెత్తారు. సీట్ల పంపకాలు, కూటమి గురించి గిరిశ్‌ చోదన్కర్‌ కమిటీ చూసుకుంటుందని, ఇక పై ఎవ్వరూ బహిరంగంగా కూటమి, సీట్ల విషయంగా మాట్లాడ కూడదని హెచ్చరించారు. అధికారంలో వాటా దిశగా మదురై సమావేశంలో తీర్మానం చేసినట్టుగా తనకు సమాచారం లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణి శంకరయ్యర్‌ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను పొగడ్తలతో ముంచెత్తడం గమనార్హం. కామరాజర్‌ స్థానంలో స్టాలిన్‌ ఉన్నారని ఓ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిని ఏకం చేసే సత్తా స్టాలిన్‌కు మాత్రమే ఉందని, అందుకే ఈ కూటమికి నాయకత్వం స్టాలిన్‌ వహించాలని సూచించారు. రాహుల్‌ పీఎం కావాలంటే కూటమి బలంగా ఉండాలని, ఇందుకు స్టాలిన్‌ ఒక్కరే కీలకం అని వ్యాఖ్యలు చేశారు. భారత సమైఖ్య వ్యవస్థ గురించి స్టాలిన్‌ స్పష్టంగా వివరించి ఉన్నారన్నారు. నెహ్రూ మరణం తర్వాత కామరాజర్‌ను పీఎం పదవి చేపట్టాలని కోరగా, ఆయన నిరాకరించినట్టు పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement