సైన్స్ దినోత్సవాన్ని విజయవంతం చేయండి
వేలూరు: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని తమిళనాడు సైన్స్ ఉద్యమం వేలూరు జిల్లా కార్యదర్శి జనార్దనన్ అన్నారు. వేలూరు జిల్లా సైన్స్ ఉద్యమ కార్యనిర్వహక కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 28వ తేదిన జాతీయ సైన్స్ దినోత్సవం కావడంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్ శాస్త్రవేత్త ఆర్.రామానుజన్ పాల్గొనే సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించాలని సమావేశంలో తీర్మానం చేశారు. అదే విధంగా ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు అన్ని యూనియన్ పరిధిలోని గ్రంథాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, గ్రామ స్థాయి నుంచి సైన్స్ ఉద్యమంపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు తీర్మానం చేశారు. అనంతరం జిల్లా సమావేశ బడ్జెట్, సభ్యత్వం, ఆరోగ్య హక్కు చట్టం, సైన్స్ ప్రచారాన్ని విస్తరింపజేయడం తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. అనంతరం ఉజ్వవన్ ఫౌండేషన్ నుంచి అవార్డు అందుకున్న సెంథమిల్ సెల్వన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉద్యమ కమిటీ అధ్యక్షుడు ముత్తు సిలుపన్, ఉపాధ్యక్షుడు కుమరన్, శశికళ, సుకుమారన్, సెల్వరాజ్, కార్యవర్గ సభ్యులు వేల్‌మురుగన్, రాజంద్రన్, రాధాక్రిష్ణన్ తదితరులు పాల్గొన్నారు.


