అధికారం మనదే..!
వచ్చే ఎన్నికల్లో 210 స్థానాల్లో గెలుపు తథ్యం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ధీమా చైన్నెలో కేపీ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం కూటమిపై సర్వాధికారాలుపళణికి అప్పగింత అనారోగ్యంతో దూరంగా తమిళ్ మగన్ హుస్సేన్
2026లో తమిళనాడులో అన్నాడీఎంకే అధికారంలోకి రావడం ఖాయం అని, అది కూడా సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళణి స్వామి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో 210 చోట్ల కూటమి గెలుపు ఖాయం అని ప్రకటించారు. కూటమిలో ఎవ్వరెవ్వరు ఉండాలో అన్న కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలన్నీ పళని స్వామికి అప్పగిస్తూ బుధవారం చైన్నెలో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఇది కాస్త కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యూహాలకు చెక్ పెట్టినట్లయ్యింది.
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం, రాష్ట్ర కార్యవర్గ భేటీ చైన్నె శివారులోని వానగరం శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్‌లో బుధవారం జరిగింది. సర్వసభ్య సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ అనారోగ్య కారణంగా సమావేశానికి హాజరు కాలేదు. దీంతో పార్టీ సంయుక్త కార్యదర్శి కేపీ మునుస్వామిని తాత్కాలిక ప్రిసీడియంచైర్మన్‌గా నియమించి, ఆయన అధ్యక్షతన ఈ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం కోసం వానగరంకు వచ్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి పార్టీ వర్గాలు బ్రహ్మారథం పట్టే విధంగా ఆహ్వానం పలికాయి. మాజీ మంత్రి బెంజిమిన్ నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హాజరైన వారందరికి పసందైన మాంసాహారం, శాఖ హారంతో విందును ఏర్పాటు చేశారు.
భవిష్యత్ మనదే..
ఈ సమావేశంలో సీనియర్ నేతలు కేపీ మునుస్వామి, సీవీ షణ్ముగం, ఆర్‌బీ ఉదయకుమార్, దిండుగల్ శ్రీనివాసన్ వంటి నేతలు ప్రసంగించే క్రమంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన వారు, బహిష్కరించ బడ్డ వారిని ద్రోహులుగా, రాజకీయ బ్రోకర్లుగా అభివర్ణిస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చారు. చివరకు పళణి స్వామి ప్రసంగిస్తూ, 2011 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఓటింగ్ శాతం వివరాలను ప్రస్తావించారు. 2021లో కేవలం 2 లక్షల ఓట్ల తేడాతో 75 స్థానాలను కోల్పోయామని వివరిస్తూ, ఇక్కడ ఓటు బ్యాంక్ శాతం పెరిగిందని, బీజేపీ బలాన్ని సైతం గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేను గద్దె దించాలన్న లక్ష్యంతో ఉన్న పార్టీలతో బలమైన కూటమి ఎన్నికల నగారా మోగినానంతరం ఏర్పడి తీరుతుందన్నారు. డీఎంకే స్టాలిన్‌లో ఓటమి భయం అన్నది రెట్టింపు అయ్యిందన్నారు. అందుకే ఆగమేఘాలపై ల్యాప్‌టాప్‌ల పంపిణీ అంటూ నాలుగున్నరేళ్ల అమలు చేయని వాగ్దానాలపై తాజాగా దృష్టి పెట్టే పనిలో పడ్డారని మండిపడ్డారు. అన్ని రంగాలలో స్టాలిన్ ప్రభుత్వ విఫలమైందని, అన్ని వర్గాలు అష్టకష్టాలు పడుతుంటే, అబూత కల్పనతో ఓ మాయాజాలాన్ని సృష్టించి ప్రజల్ని మళ్లీమభ్య పెట్టే వ్యూహంతో ఉన్నారని మండిపడ్డారు. రైతులను కలిసేందుకు డిప్యూటీ సీఎం ఉదయ నిధి వణికి పోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ను తాను ప్రశ్నిస్తున్నానంటూ, డిప్యూటీ సీఎంగా సీనియర్ నేత దురై మురుగన్‌ను ఎందుకు నియమించ లేదని డిమాండ్ చేశారు. స్టాలిన్ కుటుంబంలో ఉన్న వాళ్లకే అధికారంలో, ప్రభుత్వంలో వాటానా? అంటూ ఇలాంటి పద్దతికి అన్నాడీఎంకేలో చోటు లేదని స్పష్టం చేశారు. 2026 ఎన్నికలలో అన్నాడీఎంకే నేతృత్వంలో ఏర్పడే కూటమి 210 స్థానాలలో విజయ కేతనం ఎగుర వేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో సంపూర్ణ మెజారిటీతో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేకూ వ్యూహకర్తలు ఉన్నారని, వారి లెక్కలేమిటో, మన లెక్కలేమిటో అన్నీ పరిశీలించే సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయం అని తాను స్పష్టం చేస్తున్నట్టు తెలిపారు. 2026లో ప్రభుత్వం ఏర్పాటు తదుపరి అఽధికార పక్షం హోదాలో ఈ సర్వసభ్య, కార్యవర్గం భేటీని జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఇక నుంచి అందరూ మరింతగా శ్రమించాలని, ప్రజలతో మమేకమై ఓట్లు చేజారకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలని, విజయబావుటా ఎగుర వేద్దామని పిలుపు నిచ్చారు.
16 తీర్మానాలు..
ఈ సమావేశంలో ముఖ్య నేతలు ఒక్కో తీర్మానం ప్రవేశ పెట్టారు. కరూర్‌లో టీవీకే అధినేత విజయ్ ప్రచారం సందర్భంగా జరిగిన ఘటనలో మరణించి న 41 మృతులకు సర్వ సభ్యం భేటీలో నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. మొత్తం 16 తీర్మానాలు ప్రవేశ పెట్టగా, ఇందు లో 12 తీర్మానాలు డీఎంకే ప్రభుత్వంపై దుమ్మెత్తి పో శారు. శాంతి భద్రతలలో విఫలం, అన్ని రంగాలలో విఫలం, ఆర్థిక వ్యవస్థ పతనం, రైతులకు కంట కన్నీ ళ్లు, ఇచ్చిన వాగ్దానాల అమలులో జాప్యం, మాయాజాలం, కళ్ల బొల్లి మాటలతో కాలం నెట్టువచ్చేశారంటూ డీఎంకే ప్రభుత్వ సీఎం స్టాలిన్‌పై శివాలెత్తారు. తిరుప్పర కుండ్రం వివాదాన్ని పరోక్షంగా ఎత్తి చూ పుతూ న్యాయ వ్యవస్థను ఈ పాలకులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఖండించారు. మదురై, కోయంబత్తూరులలో మెట్రో రైలు పథకానికి అనుమతి ఇవ్వా లని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ తీర్మానాలలో అత్యంత కీలకంగా కూటమిలో ఎవ్వరెవ్వరు ఉండాలా? అన్న నిర్ణయాధికారం పళని స్వామికి అప్పగించారు. పళణి స్వామి నేతృత్వంలోని కూటమి అని స్పష్టం చేశారు. ఇది కాస్త కేంద్ర హోం మంత్రి అమిత్ షా రచిస్తూ వస్తున్న వ్యూహాలకు చెక్ పెట్టినట్టైంది. మాజీ సీఎం పన్నీరు సెల్వం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దినకరన్‌లను ఎన్‌డీఏ కూటమిలో తీసుకునే దిశగా అమిత్ షా పావులు కదుపుతున్నట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇందుకు చెక్ పెట్టే విధంగా కూటమిలో ఏఏ పార్టీలు ఉండాలో, ఎవ్వరిని చేరుకోవాలో? అనే నిర్ణయాధికారాన్ని పళణి స్వామికి అప్పగిస్తూ ఈ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం చేయడం గమనార్హం.
అధికారం మనదే..!
అధికారం మనదే..!


