త్వరలో తమిళనాట రాహుల్ పాదయాత్ర
సాక్షి, చైన్నె : కాంగ్రెస్‌ను బలోపేతం దిశగా త్వరలో లోక్ సభ ప్రధాన ప్రతి పక్ష నేత, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి, ఎంపీ ప్రియాంక గాంధీ తమిళనాడులో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టబోతుండగా, ప్రియాంక గాంధీ మహిళా చైతన్య ర్యాలీకి సన్నద్ధం కానున్నారు. వీరి పర్యటన రూట్‌మ్యాప్ తదితర ఏర్పాట్లపై దృష్టి పెడుతూ ప్రత్యేక కమిటీలను టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై బుధవారం నియమించారు. వివరాలు.. ఆది నుంచి డీఎంకే కాంగ్రెస్‌ల బంధం గురించి చెప్పనక్కర్లేదు. వీరి బంధం ప్రతి ఎన్నికలలోనూ కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా 2026 ఎన్నికలలో డీఎంకేకూటమిలో కాంగ్రెస్ కొనసాగే దిశగానే కాంగ్రెస్ మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగా తమిళనాడు, పుదుచ్చేరి పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ గిరిష్ చోదనక్కర్, ఏఐసీసీ ప్రతినిధులు సూరజ్ హెగ్డే, నివేదిత్‌ఆళ్వాలు , టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, శాసన సభాపక్ష నేత రాజేష్‌కుమార్‌లు గత వారం అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఇందులో స్టాలిన్‌కు ఓ జాబితాను అందజేసినట్లు తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్ 70 సీట్లు ఆశిస్తున్నట్టుగా చర్చ ఊపందుకుంది. ఇవన్నీ తమకు పట్టున్న స్థానాలే కావడంతో తాజా పరిణామాలను డీఎంకే నిశితంగా పరిశీలించే పనిలో పడింది. అదే సమయంలో తాము ఎంపిక చేసిన స్థానాలను అనుసంధానించే విధంగా రాహుల్, ప్రియాంకా గాంధీ పర్యలనకు కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ చర్యలు చేపట్టింది.
రంగంలోకి కమిటీ..
ఈరోడ్, మదురై, తూత్తుకుడి, తెన్‌కాశి, తిరునల్వేలి, కన్యాకుమారి, నామక్కల్, అరియలూరు, పెరంబలూరు, కన్యాకుమారి జిల్లాలోని అత్యధిక స్థానాలను తాజాగా కాంగ్రెస్ గురి పెట్టి ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ జిల్లాలను కలుపుతూ, బలోపేతం దిశగా కాంగ్రెస్ కార్యాచరణలో నిమగ్నమైంది. తమ నేత రాహుల్ గాంధీ ద్వారా పాదయాత్రకు సన్నద్ధమయ్యారు. ఆయన పాదయాత్ర రూట్ మ్యాప్ తదితర ప్రక్రియల రూపకల్పన, పర్యవేక్షణకు టీఎన్‌సీసీ నేతలు కేఎస్ అళగిరి, కేవి తంగబాలు,తిరునావుక్కరసర్, కృష్ణ స్వామి, రూబి మనోహర్‌లతో కూడిన కమిటీని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై నియమించారు. అలాగే ప్రియాంకా గాంధీ మహిళా చైతన్య యాత్ర చేపట్టనున్నారు. ఆమెకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి పెట్టే విధంగా ఎంపీలు జ్యోతి మణి, సుధా, మహిళా నేతలు హసీనా సయ్యద్, ఎమ్మెల్యే తారగైలతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీ సమగ్ర పరిశీలనతో నివేదికను సమర్పించనున్నది. ఆ మేరకు అధికారికంగా రాహుల్, ప్రియాంకాగాంధీ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, తేదీలను ప్రకటించనున్నారు. ఈ పర్యటనలో కొన్ని చోట్ల బహిరంగ సభలు సైతంనిర్వహించనున్నారు.


