తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో..
– మార్గళి మాసంలో దర్శన వేళల మార్పు
అన్నానగర్: వేల్ మురుగన్ ఆరుపడై వీడుల్లో ఒకటైన తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆలయం తెరిచే సమయాలను మార్గళి మాసం అంతా తెల్లవారుజామునకు మార్చినట్లు ఆలయ యాజమాన్యం ప్రకటించింది. వివరాలు.. తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని ప్రతిరోజూ వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. సాధారణంగా, ఇది ఉదయం 5 గంటలకు తెరుచుకుంటుంది. మార్గళి మాసం నేపథ్యంలో రోజూ ఉదయం 3 గంటలకే ఆలయం తెరిచి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించనున్నారు. ఆలయ తెరిచే సమయాల్లో మార్పు డిసెంబర్ 16, మార్గళి నెల మొదటి రోజు నుంచి జనవరి 14, మార్గళి 30వ రోజు వరకు అమల్లో ఉంటుంది. ఈ రోజుల్లో తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరవనున్నారు. తెల్లవారుజామున 3.30 గంటలకు విశ్వరూప దీపారాధన, 4 గంటలకు ఉదయ మార్తాండ అభిషేకం, 4.46 నుంచి 8.00 గంటలకు ఉదయ మార్తాండ దీపారాధన, 5.00 గంటలకు తిరుప్పల్లి ఎళుచ్చి దీపారాధన నిర్వహిస్తారు. ఆ తరువాత కింది కాల పూజలు జరుగుతాయి.
జనవరి 1న న్యూ ఇయర్ వేడుకలు
నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా తిరుచందూర్ మురుగన్ ఆలయాన్ని తెల్లవారుజామున ఒంటిగంటకే తెరనున్నారు. ఇకజనవరి 3 (ఆరుద్ర దర్శనం), 19వ తేదీ అయిన మార్గళి రోజున తెల్లవారుజామున 2 గంటలకు ఆలయంలో సేవలు ప్రారంభమవుతాయని ఆలయ సిబ్బంది స్పష్టం చేశారు.
ఐఐటీ మద్రాసులో జాతీయ క్వాంటం కమ్యూనికేషన్ హబ్
– ప్రారంభించిన సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం
కొరుక్కుపేట: ఐఐటీ మద్రాసులో భారత దేశ జాతీయ క్వాంటం కమ్యూనికేషన్ హబ్‌ను సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) ప్రారంభించింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో డీఎస్‌టీ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్ వర్చువల్‌గా పాల్గొని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ క్వాంటం మిషన్ కింద తాము నాలుగు హబ్‌లను ఏర్పాటు చేశామని అన్నారు. ఐఐటీ మద్రాసులో క్వాంటం హబ్‌ను ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అంతకుముందు ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ ఆర్థిక, జాతీయ భద్రతా దృక్కోణాల నుంచి కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైన అంశంగా మారుతోందని పేర్కొన్నారు. ఈ హబ్‌ను ఏర్పాటు చేయడానికి ఐఐటీ మద్రాసును ఎంచుకున్నందుకు డీఎస్‌టీకి కృతజ్ఞతలు తెలిపారు.
రజనీకి టాటా ప్లే గుర్తింపు
సాక్షి, చైన్నె: రజనీకాంత్ బర్త్‌డే సందర్భంగా తలైవర్ మాయాజలాం పేరిట టాటాప్లే తమిల్ క్లాసిక్స్‌లో చిత్రాల ప్రదర్శనకు సన్నద్ధమైంది. శుక్రవారం రజనీ కాంత్ బర్త్‌డే అన్న విషయం తెలిసిందే. ఆయనకు గౌరవం, గుర్తింపు కల్పించే విధంగా చిత్రాల సరళిని ఎంపిక చేశామని వివరించారు. విడుదలై, వీరా, తాయ్ వీడు, రాజాత్తి రాజా, వంటి చిత్రాలను టాటా ప్లే తమిళ క్లాసిక్స్‌లో మారథాన్‌గా ప్రదర్శించనున్నట్టు బుధవారం స్థానికంగా ప్రకటించారు.
పుదుచ్చేరిలో సంక్రాంతి కిట్
సాక్షి, చైన్నె: పుదుచ్చేరిలో సంక్రాంతి కానుకగా రూ.750 విలువ చేసే వస్తువులతో కిట్ పంపిణీకి సీఎం రంగస్వామి నిర్ణయించారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని కుటుంబ కార్డుదారులు 3.5 లక్షల మందికి ఈ కిట్లను అందజేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రత్యేక కార్డు దారులకు ఈ పథకం వర్తింపచేయడం లేదు. ఈకిట్‌లో 4 కేజీల పచ్చిబియ్యం, కిలో చక్కెర, కిలో సన్‌ఫ్లవర్ ఆయిల్, 300 గ్రాముల నెయ్యి, పొంగలి తయారీకి ఉపయోగించే వస్తువులు ఉన్నాయి. జనవరి 3నుంచి ఇంటింటా అర్హులైన రేషన్ కార్డుదారులకు వీటిని అందజేయనున్నారు.
జిల్లాల కార్యదర్శులతో
నేడు విజయ్ భేటీ
సాక్షి, చైన్నె: పార్టీ జిల్లాల కార్యదర్శులతో టీవీకే అధినేత విజయ్ భేటీకి నిర్ణయించారు. గురువారం పనయూరులో ఈ సమావేశం జరగనుంది. పార్టీ పరంగా కార్యక్రమాలను విస్తృతం చేయించడం, విజయ్ మీట్ ది పీపుల్ పర్యటనలపై దృష్టి పెట్టే విధంగా ఈ సమావేశం జరగనుంది. అలాగే బూత్ కమిటీల పనితీరు గురించి చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక, విజయ్ పార్టీలో రెండు లక్షల మందికి వివిధ పదవులను కేటాయించినట్టు ఇప్పటికే సమాచారాలు వెలువడ్డాయి. వీరందరికీ డిజిటల్ గుర్తింపు కార్డులను సిద్ధం చేశారు. వీటిని తాజాగా జరిగే సమావేశంలో జిల్లాల కార్యదర్శులకు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.


