ప్రభుత్వ గుప్పెట్లోకి ఎంఆర్‌టీఎస్
సాక్షి, చైన్నె: ఎంఆర్‌టీఎస్ రైలు సేవలను ప్రభుత్వం తన గుప్పెట్లోకి త్వరలో తీసుకోనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు జనవరిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. . బీచ్ నుంచి వేళచ్చేరి – సెయింట్ థామస్ మౌంట్ వరకు మెట్రోగా ఈ మార్గాన్ని మార్చే దిశగా రూ. 4 వేల కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. వివారాలు.. రాజధాని నగరం చైన్నెలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు తీవ్ర ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తూ వస్తోంది. ప్రధాన రవాణా మార్గాలుగా ఈఎంయూ (ఎలక్ట్రిక్ రైళ్లు) బీచ్ నుంచి తాంబరం, చెంగల్పట్టు, తిరుమాల్ పూర్ వరకు సేవల్ని అందిస్తున్నాయి. అలాగే, సెంట్రల్ మోర్ మార్కెట్ నుంచి తిరువళ్లురు, అరక్కోణం , గుమ్మిడి పూండి మార్గాల్లో ఈ రైళ్ల సేవలు అందుతున్నాయి. అలాగే బీచ్ నుంచి వేళచ్చేరి వరకు ఎంఆర్‌టీఎస్ సేవలు సాగుతున్నాయి. ఈ రైలు సేవలను సెయింట్ థామస్ మౌంట్ వరకు పొడిగించే పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఎంఆర్‌టీఎస్ రైలు సేవలు పూర్తిగా వంతెన మీద సాగుతుంది. తాజాగా, చైన్నెలో మెట్రో రైలు సేవల విస్తరణ ప్రయాణానికి మరింత సులభతరంగా మారిన నేపథ్యంలో తాజాగా ఎంఆర్‌టీఎస్‌ను మెట్రో రైలు గుప్పెట్లోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది.
4 వేల కోట్లతో..
దక్షిణరైల్వే పరిధిలో ఉన్న ఎంఆర్‌టీఎస్ సేవలను మెట్రో గుప్పుట్లోకి త్వరితగతిన తీసుకునే విధంగా సీఎం స్టాలిన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.దీనిని పూర్తిగా ప్రభుత్వ గుప్పెట్లోకి తెచ్చుకని మెట్రో రైలు సేవలకు ఆస్కారం దిశగా చర్యలుచేపట్టనున్నారు.
ఇప్పటికే చైన్నెలో రెండు మార్గాలలో మెట్రో రైలు దూసుకెళ్తున్నది. మరో మూడు మార్గాలలో 2027లో రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎంఆర్‌టీఎస్‌ను సైతం మెట్రో గుప్పెట్లోకి వచ్చిన పక్షంలో ఇదికూడా ఆధునిక హంగులతో వంతెన మార్గం సేవలకు ఉపయోగ పడ్డట్టే. తాజాగా చైన్నెలో రవాణా వ్యవస్థను సులభతరం చేస్తూ విస్తృత చర్యలను ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీచ్ నుంచి వేళచ్చేరి వరకు ఎంఆర్‌టీఎస్ రైలును పట్టాలెక్కిస్తూ వస్తున్నారు. విస్తరణలో భాగంగా త్వరలో వేళచ్చేరి నుంచి సెయింట్ థామస్ మౌంట్ వరకు ఈ రైలు సేవలు అందనున్నాయి. ఎంఆర్‌టీఎస్‌ను మెట్రో మార్గంగా మార్చేసిన పక్షంలో చైన్నెలో ఓ భాగానికి పూర్తిగా ఈ రైలు సేవలు దక్కినట్టే.


