‘పోలింగ్ బూత్’ ప్రచారానికి స్టాలిన్ శ్రీకారం
సాక్షి, చైన్నె: పోలింగ్ బూత్ ప్రచారానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శ్రీకారం చుట్టారు. బుధవారం మైలాపూర్ ఉత్తరంలోని ఆళౠ్వర్ పేట పోలింగ్ బూత్‌లో పర్యటించారు. ఇక్కడి కమిటీతో సమావేశమయ్యారు. వివరాలు. 2026లో మళ్లీ అధికారమే లక్ష్యంగా స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఓ వైపు పార్టీ పరంగా, మరోవైపు ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు వేగవంతం చేశారు. అలాగే నా పోలింగ్ కేంద్రం...విజయపు కేంద్రం నినాదంతో జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలతో సమావేశాలతో పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేస్తూ వస్తున్నారు. దీనికి కొనసాగింపుగా ఆయా పోలింగ్‌బూత్‌ల వారీగా ప్రచార కార్యక్రమానికి సిద్ధమయ్యారు. బుధవారం మైలాపూర్ పరిధిలోని ఆళ్వార్ పేట 122వ సర్కిల్‌లోని భాగం 24లోని పోలింగ్ బూత్ కమిటీతో స్టాలిన్ సమావేశమయ్యారు. ఈ ప్రచార పయనం మొదటి దశలో భాగంగా 68,463 పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఇంటెన్సివ్ ప్రచారంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఓటరు జాబితా సవరణ తదుపరి విడుదలయ్యే మాదిరి జాబితా ఆధారంగా ఓటర్లకు సాయం అందించే విధంగా 6.8 లక్షల మంది బూత్ కమిటీ సభ్యులను ఈ ప్రచారం ద్వారా రంగంలోకి దించారు. 30 రోజుల పాటూ జనవరి 10వతేదీ వరకు ఈ ప్రచార బాట సాగనుంది. తమిళనాడు వ్యాప్తంగా 68,463 కంటే ఎక్కువ మంది బూత్ కమిటీ సభ్యులు, యూనియన్, నగర, పట్టణ పంచాయతీ, జిల్లాల కార్యదర్శులు ఆయా ప్రాంతాలలో పర్యటించనున్నారు. పార్టీ పరంగా ఉన్న 78 జిల్లాల కార్యదర్శులు, 33 మంది ఎంపీలు, 124 మంది ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలు సైతం ఈ ప్రచారంలో దూసుకెళ్లనున్నారు. ఇంటింటా వెళ్లి ఓటరును పలకరించడం, వారికి కావాల్సిన సహకారం, తోడ్పాటు అందించడమే కాకుండా, అదనపు ఓట్లు అభ్యర్థుల ఖాతాలో చేరే విధంగా ఈ ప్రచారం ప్రయోజనకంగా ఉంటుందని డీఎంకే భావిస్తున్నది. తాజాగా స్టాలిన్ పాల్గొన్న బూత్ కమిటీ సమావేశంలో ఇక్కడ కనీసం 440 ఓట్లు లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. అనంతరం స్టాలిన్ ఓ ట్వీట్ చేశారు. తమిళనాడులోని ఎంత మంది షాలు వచ్చినా, ఢిల్లీ బాద్షాలు వచ్చినా, వారి వ్యూహాలు, కుట్రలను భగ్నం చేస్తామని ఎక్స్ పేజీలో పేర్కొన్నారు.
అధికారిక కార్యక్రమంలో..
పార్టీ కార్యక్రమాన్ని ముగించుకుని సీఎం స్టాలిన్ సచివాలయంకు చేరుకున్నారు. నీలగిరి జిల్లా పందలూరు, తిరువణ్ణామలైజిల్లా సేంత మంగళంలో రూ. 13.97 కోట్లతో నిర్మించిన గిడ్డంగులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే, రూ. 332 కోట్లతో తంజావూరు , నాగపట్నం, మైలాడుతురై, కడలూరు, తిరువణ్ణామలై, దిండిగల్, కృష్ణగిరిలో చేపట్టనున్న ప్రగతి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రి చక్రపాని, సీఎస్ మురుగానందం, కార్యదర్శి సత్య ప్రదసాహు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలోపదవీ విరమణ పొందిన 42 మంది జర్నలిస్టులకు ప్రయోజనం చేకూర్చే విధంగా పెన్షన్ పంపిణీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి ఒకొక్కరికి నెలకు రూ.12 వేలు పెన్షన్‌న ప్రభుత్వం ద్వారా అందించే విధంగా 10 మంది ఉత్తర్వులను స్టాలిన్ స్వయంగా అందజేశారు. కార్యక్రమానికి సమాచారశాఖ మంత్రి ఎంపీ స్వామినాథన్, కార్యదర్శి రాజారామన్, డైరెక్టర్ వైద్యనాథన్, అదనపు డైరెక్టర్ ఎస్. సెల్వరాజ్ తదితరులు హాజరయ్యారు. చివరగా తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేసిన 376 మంది సర్వేయర్లతో పాటుగా మరో 100 మందిని వివిధ పోస్టులకు నియమించారు. వీరికి ఉద్యోగ నియామక ఉత్వర్వులను సీఎం స్టాలిన్ అందజేశారు. కార్యక్రమంలో మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్, సీఎస్ మురుగానందం, విపత్తు న్విహణ శాఖ అదనపు ముఖ్య కార్యదరిశ అముద హాజరయ్యారు.


