అన్నామలై వ్యూహం ఏమిటో?
సాక్షి, చైన్నె: బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తరచూ ఢిల్లీకి పరుగులు తీస్తుండడంతో ఆయన రాజకీయ వ్యూహం ఏమిటో అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో మాజీ సీఎం పన్నీరు సెల్వంతో పదే పదే ఆయన భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఢిల్లీకి వెళ్లే ముందు ఓ సారి , ఢిల్లీకి వెళ్లొచ్చినానంతరం మరోసారి అంటూ అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీసీఎం పన్నీరు సెల్వంతో అన్నామలై భేటీ గురించి తెలిసిందే. అలాగే అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో రాజకీయ ప్రయాణం సాగిస్తున్న దినకరన్‌తో సైతం ఆయన భేటీ అవుతుండటం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. సోమవారం రాత్రి కోయంబత్తూరులో టీటీవీ దినకరన్, అన్నామలై భేటీ అయ్యారు. మరుసటి రోజే అన్నామలై ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యకు దారి తీసింది. ఢిల్లీలో తమ పార్టీ అధినేతల ఆదేశాలకు అనుగుణంగా తమిళనాట రాజకీయ వ్యూహాలకు అన్నామలై పదను పెట్టినట్టు చర్చ ఊపందుకుంది. అదే సమయంలో తనను అధ్యక్ష పదవి నుంచి తొలగించినా, ఇంత వరకు ఎలాంటి ప్రత్యామ్నాయ పదవి ఇవ్వక పోవడంపై అన్నామలై అధిష్టానం పెద్దల వద్దకు తరచూ వెళ్లి వస్తున్నట్టుగా కమలనాథులు పేర్కొంటున్నారు. అదే సమయంలో అన్నామలై ప్రత్యేక రాజకీయ వ్యూహంతో ఉన్నారన్న చర్చ కూడా సాగుతోంది. ఈ పరిస్థితులో అన్నామలైతో భేటీ గురించి మంగళశారం టీటీవీ దినకరన్ స్పందిస్తూ, ఇది రాజకీయ భేటీ కాదని స్పష్టం చేశారు. స్నేహ పూర్వకంగా కలిశామని, మాట్లాడుకున్నామని సమాధానం ఇచ్చారు.


