మెట్లోత్సవం ఏర్పాట్లపై సమీక్ష
తిరుత్తణి: తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో డిసెంబర్ 31న మెట్లోత్సవంతోపాటు జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరం ఏర్పాట్లకు సంబంధించి అధికారుల స్థాయి సమీక్ష మంగళవారం కొండ ఆలయంలో నిర్వహించారు. ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆర్డీఓ కనిమొళి, తహసీల్దార్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. మెట్లోత్సవం, నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలతోపాటు తిరువలంగాడు ఆలయంలో ఆరుద్ర వేడుకలకు సంబంధించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయం 24 గంటలపాటు తెరిచి భక్తులకు స్వామి దర్శనానికి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు సురేష్‌బాబు, ఉష, నాగన్, మోహన్ పాల్గొన్నారు.


